ఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది: ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎కు కౌంటర్‎గా భారత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎పై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (మే 25) మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఉగ్రవాదానికి నేడు దేశం మొత్తం వ్యతిరేకంగా నిలుస్తోందని అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దళాలు ప్రదర్శించిన పరాక్రమం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందంటే.. ఎన్నో కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నాయి. యావత్ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంది. ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత్ ఆర్మీ నాశనం చేసిన ఖచ్చితత్వం అసాధారణమైనది. 

ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక లక్ష్యం కాదు. ఇది మన సంకల్పం, ధైర్యానికి నిదర్శనం’’ అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న జమ్మూ కాశ్మీర్‎ను ఉగ్రవాదులు, వారి యజమానులు మళ్ళీ నాశనం చేయాలని కోరుకుంటున్నారు.. అందులో భాగంగానే టూరిస్ట్ ప్లేస్ పహల్గాంలో ఉగ్రదాడి చేశారని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం దేశానికి గొప్ప బలమన్నారు.