పారిస్: విధి వెక్కిరించి ఒలింపిక్స్‌లో పతకం నెగ్గాలన్న తన కల చెదిరిపోవడంతో బరువెక్కిన హృదయంతో ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆటకు వీడ్కోలు పలికింది. బుధవారం ఒలింపిక్స్ 50 కేజీ గోల్డ్ మెడల్ బౌట్‌కు ముందు వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు ఎదుర్కొన్న 29 ఏళ్ల వినేశ్ తనకు మద్దతు ఇచ్చిన వారిని క్షమించాలని కోరుతూ గురువారం సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించింది.
తన తల్లి ప్రేమలతను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘అమ్మా, రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, దయచేసి నన్ను క్షమించు. నీ కలలు, నా ధైర్యం అన్నీ చెదిరిపోయాయి. నాలో ఇప్పుడు శక్తి లేదు. గుడ్‌బై రెజ్లింగ్ (2001–-2024). నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి’ అని పేర్కొంది.
కల నెరవేరకుండానే
మూడుసార్లు ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ వినేశ్ ఇండియా అత్యుత్తమ మహిళా రెజ్లర్లలో ముందుంది. దిగ్గజ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫొగాట్ సిస్టర్స్‌లో ఎక్కువ సక్సెస్ సాధించింది తానే. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు గెలిచింది. కానీ, ఒలింపిక్ పతకం మాత్రం ఆమెకు కలగానే మిగిలింది.
పెదనాన్న మహావీర్ సింగ్ మార్గనిర్దేశంలో రెజ్లింగ్‌లో సత్తా చాటుతున్న తన కజిన్స్ బబితా ఫొగాట్, సంగీతను చూసి ఈ ఆటలోకి వచ్చిన ఆమె చిన్న వయసులోనే మేటి రెజ్లర్‌గా మారినా ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. ప్రతీ దశలోనూ ఆమెకు అనేక అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా గుండెధైర్యం, మొక్కవోని విశ్వాసంతో ప్రతీ సవాల్‌ను ఛేదిస్తూ ముందుకొచ్చింది. ఎదురుదెబ్బలు తగిలి కింద పడ్డ ప్రతీసారి పైకి లేచింది. రియో ఒలింపిక్స్‌లో తనకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. నాడు క్వార్టర్ ఫైనల్లో తీవ్రమైన మోకాలి గాయంతో నిష్ర్కమించింది.
]తర్వాతి నాలుగు ఏండ్లలో తన కెరీర్‌ను పునర్నిర్మించుకున్న ఫొగాట్.. కరోనా టైమ్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన సన్నద్ధతతో బరిలోకి దిగినా మళ్లీ క్వార్టర్ ఫైనల్లోనే వైదొలిగింది. ఇక, పారిస్ గేమ్స్ ముంగిట వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా తోటి రెజ్లర్లతో కలిసి రోడ్డెక్కిన ఆమె గేమ్స్‌కు కొన్ని నెలల ముందు మోకాలికి మరో సర్జరీ చేయించుకుంది. అయినా బలంగా తిరిగొచ్చి 50 కేజీల కేటగిరికీ మారి.. పారిస్ బరిలోకి దిగిన ఆమె ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. కానీ, విధి ఆడిన ఆటలో ఆమె మళ్లీ ఓడిపోయింది. చివరకు ఒలింపిక్ పతకం లేకుండానే తన కెరీర్‌ను ముగించింది.
వినేశ్ అప్పీల్ స్వీకరించిన కాస్
ఒలింపిక్ ఫైనల్లో అనర్హతను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీల్ చేసిన వినేశ్ తనకు రజత పతకాన్ని ఇవ్వాలని కోరిన తర్వాత రోజే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఒలింపిక్ గేమ్స్ సమయంలో తలెత్తే వివాదాల పరిష్కారం కోసం పారిస్‌లో ఏర్పాటు చేసిన కాస్ తాత్కాలిక విభాగం ఈ అప్పీల్‌ను విచారణకుస్వీకరించింది. వినేశ్ స్థానంలో ఫైనల్‌కు వెళ్లిన క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్ అమెరికాకు చెందిన సారా ఆన్ చేతిలో ఓడిపోయింది. ఒకవేళ కాస్ వినేశ్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే లోపేజ్‌తో పాటు ఆమెకు కూడా సంయుక్తంగా రజత పతకం లభిస్తుంది.