నాశిరకం చైనా ఉక్కుకు బ్రేక్.. విదేశీ ఉక్కుపై మూడేళ్ల పాటు అదనపు సుంకాలు ప్రకటించిన కేంద్రం

నాశిరకం చైనా ఉక్కుకు బ్రేక్.. విదేశీ ఉక్కుపై మూడేళ్ల పాటు అదనపు సుంకాలు ప్రకటించిన కేంద్రం

చైనా నుంచి వెల్లువలా భారతదేశంలోకి వచ్చి పడుతున్న చౌక ఉక్కు దిగుమతులకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని రకాల ఉక్కు దిగుమతులపై మూడేళ్ల పాటు 'సేఫ్‌గార్డ్ డ్యూటీ' విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుండి తక్కువ ధరకే నాసిరకం ఉక్కు దిగుమతి అవుతుండటంతో స్థానిక పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయనే ఆందోళనల మధ్య ప్రస్తుత చర్యలు వచ్చాయి. ఇది టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి దేశీయ కంపెనీల వ్యాపారాన్ని మెరుగుపరచనుంది. 

కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం.. ఈ అదనపు పన్ను మొదటి ఏడాది 12 శాతంగా ఉంటుంది. రెండో ఏడాదిలో ఇది 11.5 శాతానికి, మూడో ఏడాదిలో 11 శాతానికి తగ్గుతుంది. చైనా, వియత్నాం, నేపాల్ వంటి దేశాల నుంచి వచ్చే ఉక్కు దిగుమతులకు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలకు, స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు ఈ పన్ను నుండి మినహాయింపు ఇచ్చారు. గతంలో ఏప్రిల్ నెలలో ప్రభుత్వం 200 రోజుల పాటు తాత్కాలికంగా విధించిన 12 శాతం పన్నును ఇప్పుడు మూడేళ్లకు పొడిగిస్తూ శాశ్వత నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ జరిపిన సమగ్ర విచారణలో.. ఇటీవలి కాలంలో ఉక్కు దిగుమతులు అకస్మాత్తుగా భారీ స్థాయిలో పెరిగాయని తేలింది. దీనివల్ల భారతీయ ఉక్కు కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఇది దేశీయ పరిశ్రమకు తీవ్ర హాని కలిగిస్తోందని అధికారులు గుర్తించారు. నాసిరకం ఉక్కు దేశంలోకి ప్రవేశించడం వల్ల నాణ్యత దెబ్బతినడమే కాకుండా, స్థానిక మార్కెట్‌లో పోటీతత్వం కూడా తగ్గుతోందని స్టీల్ మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ :  కొత్త ఏడాది ముందు తగ్గిన గోల్డ్.. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు వాణిజ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి చైనా ఉక్కుపై ఆంక్షలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో చైనా తన అదనపు నిల్వలను తక్కువ ధరకే భారత్ వంటి దేశాలకు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీనిని అడ్డుకోవడానికి దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాలు ఇప్పటికే 'యాంటీ డంపింగ్' పన్నులను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో ముందుకెళ్తూ దేశీయ ఉక్కు రంగం కుప్పకూలకుండా పటిష్టమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది సుంకాల రూపంలో.