Operation Sindhoor: ఆపరేషన్‌ సిందూర్‌‌.. పాకిస్తాన్‌ టెర్రరిస్ట్‌ స్థావరాలపై భారత్‌ భీకర దాడులు

Operation Sindhoor: ఆపరేషన్‌ సిందూర్‌‌.. పాకిస్తాన్‌ టెర్రరిస్ట్‌ స్థావరాలపై భారత్‌ భీకర దాడులు
  • మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు
  • 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం
  • 12 మంది టెర్రరిస్టులు మృతి, 55 మందికి గాయాలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ మిసైళ్లతో అటాక్‌ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. 

భారత్‌పై కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్ట్‌ బేస్‌లను నేలమట్టం చేసింది. పూర్తి కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్‌ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన ఎలాంటి సదుపాయాలు, బేస్‌లపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. పహల్గాంపై టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు ఇండియన్‌ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణశాఖ తెలిపింది. 

దాడులు జరిపిందిలా..

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవోకే, పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు.

దాడులను ధ్రువీకరించిన పాక్ 

ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక పీవోకేలోని కోట్లి, ముజఫరాబాద్, బాహావల్‌పూర్‌‌సహా 9 ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్‌ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్‌లో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయని తెలిపింది. పాక్‌ డీజీ ఐఎస్‌పీఆర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ స్పందిస్తూ పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని చెప్పారు. ముజఫరాబాద్‌లోని పవర్ గ్రిడ్‌ను పేల్చివేయడంతో కరెంటు పోయి, చిమ్మ చీకట్లు అలుముకున్నాయని, ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. 

12 మంది టెర్రరిస్టులు మృతి: రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన

ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడినదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ లోని ఏ సైనిక స్థావరంపైనా దాడి జరగలేదని పేర్కొంది. టెర్రరిస్ట్‌ బేస్‌లను గుర్తించి దాడి చేశామని చెప్పింది. ఈ విషయంలో భారత్‌ అత్యంత సంయమనంతో వ్యవహరించిందని తెలిపింది. పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల్లో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారని, 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేషన్..

పీవోకేలోని టెర్రరిస్టు క్యాంపులపై దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రతిదాడులు ఎదురైనా తిప్పికొట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఇండియన్‌ ఆర్మీ వెల్లడించింది. ఇండియా - పాక్ బార్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను యాక్టివేట్ చేసినట్టు తెలిపింది. 

అమెరికా విదేశాంగ మంత్రికి దోవల్ ఫోన్ 

పాక్ టెర్రర్ క్యాంపులపై దాడులు ప్రారంభించిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఫోన్ లో మాట్లాడారు. టెర్రర్ క్యాంపులపై చేపట్టిన దాడుల గురించి ఆయన వివరించారని వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.

త్వరగా ముగిసిపోవాలి.. 

ఇది చాలా బాధాకరం. అక్కడి ప్రజలకు ఏదో జరగబోతుందని ముందే తెలుసు. ఇండియన్స్‌ చాలా కాలంగా టెర్రరిజంపై పోరాడుతున్నారు. ఈ పోరాటం  త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నాను.

డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా​ ప్రెసిడెంట్

ఇది యుద్ధ చర్యే: పాక్ ప్రధాని షెహబాజ్‌

పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఈ దాడులను యుద్ధ చర్యగా పేర్కొంటూ ఖండించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్జాతీయ, దేశీయ విమానాలను నిలిపివేశారు.

సిందూర్‌‌ పేరే ఎందుకంటే..

హిందూత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందూత్వ ప్రతీక అయిన, సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది.

టార్గెట్స్ ఇవే..

  • మురిడ్కేలోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్
  • బహవల్పూర్‌ లోని ‘జైష్ ఏ మహ్మద్’ క్యాంప్
  • ఈ రెండు స్థావరాలతో పాటు మొత్తం 9 టెర్రర్ క్యాంపులపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది.