న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్‌లో ఇండియాకు రెండో ఓటమి ఎదురైంది. ఆసియా/ఓసియానియా గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 0–3తో ఇండోనేసియా చేతిలో ఓడింది. దాంతో ముఖాముఖి రికార్డులో ఇండియా 3–6తో వెనకబడింది. తొలి సింగిల్స్‌లో వైష్ణవి అడ్కర్ 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో ప్రిస్కా మడెలిన్ నుగ్రోహ్ చేతిలో పోరాడి ఓడింది.
3 గంటలా 6 నిమిషాల మ్యాచ్‌లో వైష్ణవి తొలి సెట్‌లో గెలిచినా తర్వాతి రెండు సెట్లలో తడబడింది. ముఖ్యంగా టైబ్రేక్‌లో పాయింట్లు రాబట్టడంలో విఫలమైంది. ఇక రెండో మ్యాచ్‌లో సహజ యమలపల్లి 2–6, 1–6తో జెనిసి జెన్ చేతిలో పరాజయం చవిచూసింది. మ్యాచ్ ఆరంభం నుంచే తడబడిన ఇండియన్ ప్లేయర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా 63 నిమిషాల్లోనే మ్యాచ్‌ను చేజార్చుకుంది. కీలకమైన డబుల్స్‌లో రుతుజా భోసలే–అంకితా రైనా 3–6, 6–7 (4/7)తో అల్డిలా సుట్జాది–జెనిసి జెన్ చేతిలో కంగుతిన్నారు. ఇండియా తర్వాతి మ్యాచ్‌ల్లో మంగోలియా, కొరియాతో తలపడుతుంది. ఈ గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
