తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీసం ఆయిల్ నిల్వలు కొనుగోలు చేయలేక కరెంట్ ఉత్పత్తి విషయంలో చేతులెత్తేసిన ఆ దేశానికి ఇండియా అండగా నిలుస్తోంది. ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబోలో మన దేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ అనుబంధ సంస్థ ఏకంగా 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను అందజేసింది. ఈ ఆయిల్‌ను సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకుని కరెంట్ ఉత్పత్తికి వాడనుంది. ఆ దేశంలో సంక్షోభం నెలకొనడంతో కొద్ది రోజులుగా దాదాపు 10 నుంచి 13 గంటల పాటు కరెంట్ కోత విధిస్తోంది. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశం కష్టం తీర్చేందుకు భారత్ ముందుకొచ్చింది.
More fuel supplies delivered by #India to #SriLanka! A consignment of 40,000 MT of diesel under #Indian assistance through Line of Credit of $500 mn was handed over by High Commissioner to Hon'ble Energy Minister Gamini Lokuge in #Colombo today. (1/2) pic.twitter.com/j8S2IsOw29
— India in Sri Lanka (@IndiainSL) April 2, 2022
ఇవాళ శ్రీలంకకు అందించిన 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను ఆ దేశ ఇంధన శాఖ మంత్రి జెమిని లొకుగెకు కొలంబోలోని భారత హైకమిషనర్ అందించారు. సుమారు రూ.3,800 కోట్ల విలువ చేసే ఈ డీజిల్‌ను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సాయంగా భారత్ అందించింది. ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇలా ఆ దేశానికి ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అందించడం ఇది నాలుగోసారి అని, దీనితో కలిపి గత 50 రోజుల్లో మొత్తం 2 లక్షల టన్నుల ఆయిల్‌ను సప్లై చేశామని ట్వీట్‌లో పేర్కొన్నారు.
