
- సిరీస్ మొత్తానికి నితీశ్ దూరం
- ఇంగ్లండ్ తుది జట్టులోకి డాసన్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో కీలకమైన నాలుగో టెస్టులో ఇండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది. యంగ్ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా మిగిలిన సిరీస్ నుంచి తప్పుకున్నాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బుధవారం మొదలయ్యే టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. లిగమెంట్ దెబ్బతిన్నట్లు స్కానింగ్‌లో తేలడంతో నితీశ్ ఇండియా తిరిగొస్తాడని వెల్లడించింది.
అతని ప్లేస్‌లో మరో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమే అనొచ్చు. మరోవైపు, గజ్జల్లో గాయంతో బాధపడుతున్న పేసర్ ఆకాశ్ దీప్ కూడా నాలుగో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాకప్ పేసర్‌గా జట్టులోకి వచ్చిన హర్యానా యంగ్‌స్టర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేసే చాన్సుంది.
పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతున్నాడని సిరాజ్ తెలపగా.. ఈ ఇద్దరితో కలిసి మూడో పేసర్‌గా అన్షుల్‌ను ఆడించే ఆప్షన్‌ను మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది. అతనికి ప్రసిధ్ కృష్ణ నుంచి పోటీ ఉంది. రెండో టెస్టులో భారీగా రన్స్ ఇచ్చుకోవడంతో ప్రసిధ్‌ను లార్డ్స్‌లో ఆడించలేదు. ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్‌లో బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, శార్దూల్‌తో కలిసి అన్షుల్ ముమ్మరంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
వేలి గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. నితీశ్ రెడ్డి స్వదేశానికి తిరిగొస్తుండటంతో యశస్వి జైస్వాల్ స్లిప్ ఫీల్డింగ్ కోసం డ్రిల్స్ చేస్తూ కనిపించాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడ్డ స్పిన్నర్ షోయబ్ బషీర్ ప్లేస్‌లో మరో స్పినర్ లియామ్ డాసన్‌ను తీసుకుంది. 2017లో తన చివరి టెస్టు ఆడిన డాసమ్ ఎనిమిదేండ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు.