మొనాకో: గత రెండేండ్లుగా డోపింగ్ కేసుల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఇండియాను వరల్డ్ అథ్లెటిక్స్‌కు చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) అత్యంత ప్రమాదకరమైన డోపింగ్ (హై రిస్క్) దేశంగా ప్రకటించింది. దీంతో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) స్థాయి కేటగిరీ–బి నుంచి అత్యంత కఠిన నిబంధనలు వర్తించే కేటగిరీ–ఎకి పడిపోయింది.
గత నాలుగేండ్ల గణాంకాల ప్రకారం.. 2022లో 48, 2023లో 63, 2024లో 71 డోపింగ్ కేసులు నమోదు కాగా, 2025లో ఇప్పటివరకు 30 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం 148 మంది అథ్లెట్లు సస్పెన్షన్‌లో ఉండటంతో, కెన్యాను అధిగమించి డోపింగ్ నేరాల్లో ఇండియా ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. తాజా నిబంధనల ప్రకారం ఇండియా అథ్లెట్లు ఇకపై మరిన్ని కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ వంటి మెగా ఈవెంట్లలో పాల్గొనే వారు, ఆ పోటీలకు 10 నెలల ముందు కనీసం మూడుసార్లు ముందస్తు సమాచారం లేని డోపింగ్ పరీక్షలకు హాజరుకావడం తప్పనిసరి కానుంది. దేశీయంగా జరుగుతున్న డోపింగ్ నిరోధక చర్యలు సరిపోవడం లేదని, క్రీడల సమగ్రతను కాపాడేందుకు ఏఎఫ్ఐ తక్షణమే సంస్కరణలు చేపట్టాలని అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ స్పష్టం చేసింది.

