ఒకేసారి టెస్టు, టీ20 సిరీస్.‌.బీసీసీఐ ప్రపోజల్

ఒకేసారి టెస్టు, టీ20 సిరీస్.‌.బీసీసీఐ ప్రపోజల్

న్యూఢిల్లీ: కరోనా ప్రభావం తగ్గి క్రికెట్‌‌ మళ్లీ మొదలైంది. ఈడెన్‌‌ గ్రౌండ్స్‌‌లో ఇంగ్లండ్‌‌తో టీమిండియా టెస్టు మ్యాచ్‌‌ ముగిసింది. ఆ తర్వాతి రోజే అడిలైడ్‌‌లో ఆస్ట్రేలియాతో ఇండియా టీ20 మ్యాచ్‌‌లో బరిలోకి దిగింది. అదేంటి…ఒక జట్టు ఏకకాలంలో  రెండు సిరీస్‌‌ల్లో ఆడడం ఎలా సాధ్యం అనుకుంటున్నారా? బీసీసీఐ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఏకకాలంలో అభిమానులు ఈ డబుల్‌‌ మజాను ఆస్వాదించనున్నారు. కరోనా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు బోర్డు అనేక మార్గాలు అన్వేషిస్తోంది. అందులో భాగంగా  ఒకేసారి రెండు జట్లతో వేర్వేరు ఫార్మాట్లలో మ్యాచ్‌‌లు ఆడించాలన్న ప్రపోజల్‌‌ తెర పైకి వచ్చింది. పరిస్థితులు కంట్రోల్‌‌లోకి వచ్చిన తర్వాత ఒకేసారి రెడ్‌‌ బాల్‌‌, వైట్‌‌ బాల్‌‌ ఫార్మాట్లలో డిఫరెంట్‌‌ జట్లను బరిలోకి దించి వీలైనంత ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇన్సూరెన్స్‌‌ లేదు కాబట్టి ఒకవేళ ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌ రద్దయితే బోర్డు దాదాపు 3800 కోట్లు నష్టపోనుంది. బ్రాడ్‌‌కాస్టర్‌‌ స్టార్‌‌ స్పోర్ట్స్‌‌ ఏకంగా 3269 కోట్లు లాస్‌‌ అవుతుంది.

మార్చిలో ఇండియా–సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌‌ ఆగిపోయింది. అలాగే, ఈ ఏడాది సెప్టెంబర్‌‌–అక్టోబర్‌‌లో ఇంగ్లండ్‌‌ టీమ్‌‌ ఇండియా టూర్‌‌ కూడా రద్దయితే బోర్డుకు మరింత నష్టం వస్తుంది. అయితే, రెండు టీమ్స్‌‌తో.. రెండు డిఫరెంట్‌‌ మ్యాచ్‌‌లు ఆడించాలంటే  లాజిస్టిక్స్ విషయంలో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ, బోర్డుకు ఆదాయం తెచ్చిపెడుతుందని పలువురు భావిస్తున్నారు. ‘ఇంటర్నేషల్‌‌ క్రికెట్‌‌ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ పరిస్థితుల్లో స్పాన్సర్స్‌‌ నుంచి ఫ్యాన్స్‌‌ వరకూ వాటాదారులందరినీ కాపాడుకోవాలంటే మన ముందున్న ఏకైక మార్గం రెండు డిఫరెంట్‌‌ టీమ్స్‌‌తో ఏకకాలంలో  టెస్టు సిరీస్‌‌, టీ20 సిరీస్‌‌ ఆడించాలి’అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ ఈ ఐడియాకు ఆమోదం లభిస్తే..  ఆస్ట్రేలియా తర్వాత ఒకేటైమ్‌‌లో రెండు వేర్వేరు జట్లను బరిలోకి దింపిన రెండో టీమ్‌‌గా ఇండియా నిలుస్తుంది. 2017 ఫిబ్రవరి 22నలో ఆసీస్‌‌ అడిలైడ్‌‌ వేదికగా శ్రీలంకతో టీ20 మ్యాచ్‌‌ ఆడింది. ఆ తర్వాతి రోజే బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీలో భాగంగా పుణెలో ఇండియాతో టెస్టు మ్యాచ్‌‌లో బరిలోకి దిగింది.  బీసీసీఐ కూడా ఈ ప్లాన్‌‌ను  అమలు చేయాలని చూస్తోంది. అందుకోసం ముందుగా రెండు టీమ్స్‌‌ను డివైడ్‌‌ చేసేందుకు కోచింగ్‌‌ స్టాఫ్‌‌ వర్కౌట్‌‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.