
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో టీమిండియా టూర్ వాయిదా పడే అవకాశాలున్నాయి. ఆగస్టు 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకాలో ఇండియా.. బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ఆ దేశంలో భద్రతపై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ టూర్‌ను వాయిదా వేయనున్నారు. ‘పౌర అశాంతి తర్వాత బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితులను గమనిస్తున్నాం’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతానికి సిరీస్‌ను మొత్తానికి రద్దు చేయలేదు. కానీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ పాయింట్లతో ముడిపడి ఉన్న సిరీస్ కావడంతో వచ్చే ఏడాది నిర్వహించే అవకాశముంది. ‘బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత శాంతి భద్రతలను జాగ్రత్తగా చూసుకునే స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. ఆ టైమ్‌లో ఈ పర్యటన కొనసాగితే బాగుంటుంది’ అని బీసీసీఐ పేర్కొంది. బంగ్లాలో ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలనలో ఉంది.