
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై టీమిండియా యంగ్ టీమ్ మరోసారి ఆధిపత్యం చూపించింది. కంగారులలపై ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకుంది. బుధవారం (సెప్టెంబర్ 23) జరిగిన రెండో అనధికారిక యూత్ వన్డేలో 51 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్ గెలుచుకుంది. స్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (70), విహాన్ మల్హోత్రా (70), అభిజ్ఞాన్ కుందు (71) అర్ధ సెంచరీలతో రాణించడంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అండర్-19 జట్టు 49.4 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్య చేధనతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 249 పరుగులు చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ ఆయుష్ మాత్రే (0) వికెట్ కోల్పోయింది. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా రెండో వికెట్ కు 117 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ ఔటైనా అభిజ్ఞాన్ కుందు (71) అర్ధ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. క్రీజ్ లో ఏ ఒక్కరూ కూడా నిలబడలేకపోయారు. మంచి టచ్ లో కనిపించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. జేడెన్ డ్రేపర్ ఒక్కడే భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదర్కొంటూ సెంచరీ చేశాడు. 72 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 107 పరుగులు చేసి జట్టు విజయం కోసం పోరాడాడు. 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్ జట్టును ఆర్యన్ శర్మతో కలిసి 112 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. చివర్లో పుంజుకున్న భారత బౌలర్లు త్వరగా వికెట్లు తీసి మ్యాచ్ ను ముగించారు.