
- సూర్యకుమార్‌పై ఫోకస్
- విజయంపై ఇరుజట్ల ధీమా
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
చెన్నై: వరల్డ్ క్రికెట్‌లో రెండు బెస్ట్ టీమ్స్ ఇండియా, ఆస్ట్రేలియా. ఇరుజట్లలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్లు గణనీయమైన ప్రభావం చూపెట్టారు. ఫలితంగా తొలి వన్డేలో ఇండియా నెగ్గితే, సెకండ్ మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్.. సిరీస్‌ను 1–1తో సమం చేసింది. అయితే సిరీస్ విన్నర్‌ను తేల్చే కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు దుమ్మురేపాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలో ఇరుజట్ల మధ్య థర్డ్ వన్డే జరగనుంది. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలమని వార్తలు వస్తున్న నేపథ్యంలో సిరీస్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ మొదలైంది.
సూర్యకు లాస్ట్ చాన్స్!
రెండో వన్డేలో ఘోర బ్యాటింగ్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌కు ఇండియా మేనేజ్‌మెంట్ పక్కా ప్లాన్స్ రచిస్తోంది. స్టార్క్ పేస్ ధాటికి బెంబేలెత్తిన ఇండియా టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో ‘గోల్డెన్ డక్’ అయిన సూర్య ఈ మ్యాచ్‌లో గాడిలో పడకుంటే నెక్స్ట్ ఏంటీ? అనే దానిపై మేనేజ్‌మెంట్ కసరత్తు చేయనుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఓపెనింగ్‌లో రోహిత్, గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడాలి. వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువగా వన్డేలు ఆడే చాన్స్ లేకపోవడంతో కోహ్లీ, రాహుల్, పాండ్యా కూడా పెద్ద స్కోర్లపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌పై కూడా ఇండియా ఎక్కు వగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇద్ద రు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల స్ట్రాటజీ వర్కౌట్ చేస్తే.. స్టార్టింగ్‌లో పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్ పిచ్‌ను బాగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ లాస్ట్ మినిట్‌లో థర్డ్ పేసర్ అవసరం అనుకుంటే శార్దూల్, జైదేవ్ ఉనాద్కట్‌లో ఒకరికి చాన్స్ దక్కొచ్చు. ఇక ముగ్గురు స్పిన్నర్లలో జడేజా, అక్షర్ పటేల్ ఖాయం కాగా, పిచ్‌ను బట్టి కుల్దీప్, సుందర్‌లో ఒకర్ని ఎంచుకోవచ్చు.
వార్నర్ వచ్చేనా?
సిరీస్ విన్నర్‌ను తేల్చే మ్యాచ్ కావ డంతో ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఏమైనా ప్రయోగం చేస్తుందా? చూడాలి. ఒకవేళ తుది జట్టులో మార్పు చేస్తే వార్నర్ ఫైనల్ ఎలెవన్‌లోకి రానున్నాడు. మిగతా లైనప్‌ను మార్చకపోవచ్చు. వార్నర్ ఓపెనింగ్‌కు వెళ్తే, గ్రీన్ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. సెకండ్ మ్యాచ్‌లో దంచికొట్టిన హెడ్‌తో పాటు మార్ష్, క్యారీ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. భారీ హిట్టర్ మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ గాడిలో పడతారా? చూడాలి. బౌలింగ్‌లో స్టార్క్ ఫామ్ ఆసీస్‌కు బలంగా మారింది. అబాట్, ఎల్లిస్‌ను కొనసాగిస్తే, ఏకైక స్పిన్నర్‌గా ఆడమ్ జంపా తుది జట్టులో ఉండొచ్చు. రెండో స్పిన్నర్‌గా ఎగర్‌ను తీసుకునే చాన్స్ ఉంది.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ / వాషింగ్టన్ సుందర్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, సీన్ అబాట్ / ఎగర్ / నాథన్ ఎల్లిస్, స్టార్క్, జంపా.