- నేడు ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20
- ఫుల్‌జోష్‌లో రోహిత్ సేన
- ఒత్తిడిలో బంగ్లా పులులు
- రా 7 గం. నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
నాగ్‌పూర్: సొంతగడ్డపై ఈ సీజన్‌లో తొలి టీ20 సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌తో అమీతుమీకి రెడీ అయింది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ)స్టేడియంలో ఆదివారం జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు ఇప్పటికే చెరో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ అయ్యింది. టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉన్నప్పటికీ బంగ్లా కూడా గట్టిపోటీ ఇస్తోంది. వీసీఏ వికెట్ సాధారణంగా స్లో గా ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నారు.
ఒకే ఒక్క మార్పుతో !
పెద్దగా సమస్యలు లేకపోవడంతో రాజ్‌కోట్‌లో ఆడిన జట్టుతోనే ఫైనల్ టీ20లోనూ టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే, ఓపెనర్లలో రోహిత్ సూపర్ ఫామ్‌లో ఉండగా, ధవన్ వేగంగా రన్స్ చేయలేకపోవడం సమస్యగా మారింది. పైగా షాట్ సెలెక్షన్‌లో శిఖర్ తప్పులు చేస్తున్నాడు. వన్‌డౌన్‌లో వస్తున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. విమర్శకుల నోటికి తాళం వెయ్యడానికి వీరిద్దరికి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇక, రెండు మ్యాచ్‌ల్లో కలిపి క్రీజులో ఉన్నది తక్కువసేపే అయినా శ్రేయస్ అయ్యర్ ఫామ్ చూపెట్టాడు. కానీ, రిషబ్‌పంత్ ఇటు కీపింగ్, అటు బ్యాటింగ్‌లోను తడబాటు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లాడిన శివమ్ దూబే నాగ్‌పూర్‌లో సత్తా చాటకపోతే జట్టుకు దూరం కాక తప్పదు. బౌలింగ్‌లోనూ ఇండియాకు పెద్దగా సమస్యలు లేవు. క్రునాల్‌కు ఇప్పటిదాకా బ్యాటింగ్‌కు తగిన అవకాశం రాకపోయినా బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ యజ్వేంద్ర చహల్ షార్ట్ ఫార్మాట్‌లో తానెంత విలువైన బౌలరో చూపిస్తుండగా, వాషింగ్టన్ సుందర్ కూడా రాణిస్తున్నాడు. పేసర్ దీపక్ చహర్ సత్తా చాటుతుండగా, గత రెండు టీ20ల్లో విఫలమైన పేసర్ ఖలీల్ అహ్మద్‌పై వేటు ఖాయంగా కనిపిస్తుంది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఫైనల్ ఎలెవన్‌లోకి వచ్చే చాన్సుంది. మనీశ్‌పాండే, సంజు శాంసన్, రాహుల్ చహర్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావొచ్చు.
బంగ్లా కూడా బలంగానే..
విజయంతో సిరీస్‌ను ప్రారంభించిన బంగ్లా.. సీనియర్లు లేకపోయినా జట్టుగా బలంగానే ఉంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ అంతా మంచి టచ్‌లో ఉన్నారు. అయితే భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం వారికి ప్రతికూలంగా మారింది. యువ ఆటగాడు నయీమ్‌తోపాటు సౌమ్యసర్కార్ రాణించాలని కోరుకుంటుంది. సీనియర్ ముష్ఫికర్ రహీమ్ మరోసారి కీలకం కానున్నాడు. ఇక, స్పిన్నర్ అమినుల్ ఇస్లామ్‌పై బంగ్లా భారీగానే ఆశలు పెట్టుకుంది. పొదుపుగా బౌలింగ్ చేస్తున్న అమినుల్ ఇప్పటిదాకా నాలుగు వికెట్లు తీశాడు. పిచ్ దృష్ట్యా అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాలనుకుంటే తైజుల్ ఇస్లామ్ తుదిజట్టులోకి వచ్చే చాన్సుంది. సీనియర్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోవడం సమస్యగా మారింది. గాయాలతో బాధపడుతున్న ముస్తాఫిజుర్, మొసాద్దెక్ ఫిటెనెస్‌పై కూడా సందేహాలున్నాయి.
జట్లు(అంచనా)
ఇండియా : రోహిత్(కెప్టెన్), శిఖర్, రాహుల్, శ్రేయస్, పంత్, దూబే, క్రునాల్, వాషింగ్టన్, దీపక్, ఖలీల్/శార్దూల్, చహల్.
బంగ్లాదేశ్ : లిటన్‌దాస్, నయీమ్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్, మహ్మదుల్లా(కెప్టెన్), అఫిఫ్, మొసాద్దెక్, అమినుల్, షఫియుల్/తైజుల్, అల్‌అమిన్, ముస్తాఫిజుర్.
