
- 7–0తో ఇండియా గ్రాండ్ విక్టరీ
- ఆసియా కప్ హాకీలో నేడు సౌత్ కొరియాతో టైటిల్ ఫైట్
- రా. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
రాజ్‌గిర్ (బీహార్): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఇండియా మెన్స్ టీమ్ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తోంది. శనివారం జరిగిన చివరి సూపర్ –4 మ్యాచ్‌లో టీమిండియా గోల్స్ వర్షం కురిపిస్తూ 7-–0తో చైనాను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరుకుంది. అభిషేక్ (46వ, 50వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సత్తా చాటగా.. షిలానంద్ లక్రా (4వ ని), దిల్‌ప్రీత్ సింగ్ (7వ ని), మన్‌దీప్ సింగ్ (18వ ని), రాజ్‌కుమార్ పాల్ (37వ ని), సుఖ్‌జీత్ సింగ్ (39వ ని) తలో గోల్‌తో జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఆరంభం నుంచే ఆతిథ్య జట్టు దూకుడుగా ఆడింది.
నాలుగో నిమిషంలోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అందించిన ఏరియల్ బాల్‌ను జర్మన్‌ప్రీత్ అందుకోగా దాన్ని షిలానంద్ లక్రా అద్భుతంగా గోల్‌పోస్ట్‌లోకి పంపి తొలి ఆధిక్యాన్ని అందించాడు. మరో మూడు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ కొట్టగా, చైనా గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. అయితే రీబౌండ్ అయిన బాల్‌ను దిల్‌ప్రీత్ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2–-0కి పెంచాడు. రెండో క్వార్టర్ 18వ నిమిషంలో వివేక్ షాట్‌ను చైనా కీపర్ ఆపగా, రీబౌండ్‌లో మన్‌దీప్ గోల్ చేసి స్కోరును 3-–0కి తీసుకెళ్లాడు. సెకండాఫ్‌లోనూ ఇండియా అదే జోరు కొనసాగించింది. రెండు నిమిషాల తేడాలో రాజ్‌కుమార్, సుఖ్‌జీత్ గోల్స్ చేయగా, చివరి క్వార్టర్‌లో అభిషేక్ డబుల్ ధమాకాతో చైనాను ఏడిపించాడు. ఈ విజయంతో ఇండియా సూపర్– 4 పట్టికలో 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో సౌత్ కొరియా 4---–3తో మలేసియాపై ఉత్కంఠ విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో కొరియాతో ఇండియా పోటీ పడనుంది. ఇందులో నెగ్గిన జట్టు 2026 వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతుంది.