భారత్ 298/8డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ 272

భారత్ 298/8డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ 272
  • 8వ వికెట్ కు బుమ్రా-షమీ రికార్డు భాగస్వామ్యం
  • డ్రస్సింగ్ రూమ్లో బుమ్రా-షమీలకు గ్రాండ్ వెల్కమ్

లండన్: చారిత్రకమైన లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 298/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ పై 271 పరుగుల ఆధిక్యం చేరుకోగానే డిక్లేర్ చేస్తూ ఇంగ్లండ్ కు 272 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఇవాళ ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే భారత్ టపటపా వికెట్లు చేజార్చుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వికెట్ కీపర్ కమ్ డ్యాషింగ్ హిట్టర్ రిషబ్ పంత్ కేవలం 22 పరుగులు చేయగా ఆ తర్వాత ఇషాంత్ శర్మ 16 పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత్ 200 పరుగులకే ఆలౌటయ్యే పరిస్థితి కనిపించింది. అయితే 8వ వికెట్ పార్ట్ నర్ షిప్ లో మహమ్మద్ షమీ-బుమ్రా రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ.. వారి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. 8వ వికెట్ పార్ట్ నర్ షిప్ లో వీరిద్దరూ 120 బంతులు ఎదుర్కొని 89 పరుగుల భాగస్వామ్యం సాధించారు. 56 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మహమ్మద్ షమి 70 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా.. బుమ్రా 64 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతో 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 
షమీ-బుమ్రాలకు డ్రస్సింగ్ రూమ్ లో గ్రాండ్ వెల్కమ్
చారిత్రక లార్డ్స్ మైదానంలో 8వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఆధిపత్యానన్ని సవాల్ చేసిన మహమ్మద్ షమీ –బుమ్రాలకు డ్రస్సింగ్ రూమ్ లో జట్టు సభ్యుల నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. లంచ్ బ్రేక్ టైంకు భారత్ 286/8 పరుగులు చేసింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. ఇంగ్లండ్ పై పోరాడి దీటుగా బదులిచ్చిన మహమ్మద్ షమీ –బుమ్రాల ఇన్నింగ్స్ చరిత్రలో గుర్తుండిపోతుందని భావిస్తూ బీసీసీఐ సదరు వీడియోతో ట్వీట్ చేసింది.  
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వరుస రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. పేసర్లు బ్యాటింగ్ లో ఇరగదీసిన బుమ్రా, మహమ్మద్ షమీలో బంతితోనూ ఇంగ్లండ్ ను ఆటాడిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన బుమ్రా 3వ బంతికే రోరీబర్న్స్ కు ఊరించే బంతి వేయగా.. దాన్నిషాట్ ఆడబోయి సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో ఓవర్ బంతిని తీసుకున్న మహమ్మద్ షమీ తానేం తక్కువకానంటూ.. సిబ్లీని డకౌట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. తొలి రెండు ఓవర్లకే ఒక పరుగుకు రెండు పరుగులతో ఇంగ్లండ్ చిక్కుల్లోపడిపోయింది. ప్రస్తుతం హమీద్, జోరూట్ లు క్రీజులో ఉన్నారు.