
బటుమి (జార్జియా): ప్రతిష్టాత్మక ఫిడే విమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ ఇండియాకు ఖరారవ్వగా.. దాన్ని అందుకునేందుకు లెజెండరీ ప్లేయర్ , తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, యంగ్ సెన్సేషన్ దివ్య దేశ్‌ముఖ్ అమీతుమీకి రెడీ అయ్యారు. శని, ఆదివారాల్లో జరిగే ఫైనల్ ఫైట్‌లో తలపడనున్నారు. ఈ టోర్నీ చరిత్రలో ఇద్దరు ఇండియా ప్లేయర్లు ఫైనల్లో పోటీ పడటం ఇదే మొదటిసారి.
హంపి, దివ్య ఫైనల్ చేరుకోవడంతో దేశానికి వరల్డ్ కప్ రానుండగా.. ఈ ఇద్దరూ వచ్చే ఏడాది జరిగే ప్రతిష్టాత్మకమైన విమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించారు. ఇప్పుడు టైటిల్ ఎవరిది అన్నది ఆసక్తిగా మారింది. ఎన్నో మెగా ఈవెంట్లు, పెద్ద మ్యాచ్‌ల్లో ఆడిన అపారమైన అనుభవం, మంచి ట్రాక్ రికార్డు ఉన్న 38 ఏండ్ల హంపి ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
హంపి వయసులో సగం ఉన్న 19 ఏండ్ల దివ్య ఈ టోర్నీలో ఇప్పటికే టాప్-10లో ఉన్న ముగ్గురు ప్లేయర్లను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఫైనల్లో దివ్య నుంచి హంపికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ శని, ఆదివారాల్లో రెండు క్లాసికల్ గేమ్స్ ఆడతారు. ఇందులో ఫలితం తేలకపోతే విన్నర్‌ను తేల్చేందుకు సోమవారం టై బ్రేక్స్ నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్‌లో విజేతకు సుమారు రూ.42 లక్షలు, రన్నరప్‌కు రూ. 29 లక్షలు ప్రైజ్ మనీ లభిస్తుంది.