తిరువనంతపురం: టీ20 వరల్డ్ కప్ లైనప్‌ను పూర్తి స్థాయిలో పరీక్షించుకునేందుకు ఇండియా, న్యూజిలాండ్‌కు ఆఖరి అవకాశం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఘనమైన ముగింపు ఇవ్వాలని భావిస్తున్న ఇరు జట్లూ శనివారం జరిగే ఆఖరి టీ20కి రెడీ అయ్యాయి. ఐదుగురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో.. టీమిండియా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఫలితంగా సిరీస్‌లో ఆధిక్యం 3–1కి తగ్గింది. దాంతో ఈ మ్యాచ్‌పై హోమ్ టీమ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేకపోయినా.. ఓపెనింగ్‌లో సంజూ శాంసన్ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అతను ఫుట్ మూవ్‌మెంట్, బ్యాట్ స్వింగ్‌లాంటి సాంకేతిక లోపాలతో ఇబ్బందిపడుతున్నాడు.
కనీసం సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లోనైనా శాంసన్ ఆ లోపాలను అధిగమిస్తాడేమో చూడాలి. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ బయటకు వెల్లడించని గాయంతో బాధపడుతున్నాడు. ఈ మ్యాచ్‌కూ ఇషాన్ దూరమైతే శ్రేయస్ అయ్యర్‌కు చాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. తొలి టీ20లో వేలికి గాయం కావడంతో అక్షర్ పటేల్ తర్వాతి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేదు. నెట్స్‌లో కొన్ని బాల్స్ వేసినా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేదు. దాంతో ఇషాన్, అక్షర్‌పై ఉత్కంఠ నెలకొంది. అభిషేక్, సూర్య కుమార్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేసే చాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. కుల్దీప్ యాదవ్ ప్లేస్‌లో జట్టులోకి రావొచ్చు. అక్షర్ అందుబాటులోకి వస్తే హర్షిత్ రాణాకు రెస్ట్ ఇవ్వొచ్చు. అర్ష్‌దీప్, బుమ్రా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్ కప్ చివరి సన్నాహకం, సిరీస్ ఆఖరి మ్యాచ్ కావడంతో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది.
నీషమ్‌కు చాన్స్ ఇస్తారా?
తొలి మూడు మ్యాచ్‌ల్లో తేలిపోయిన న్యూజిలాండ్ నాలుగో టీ20లో మాత్రం దుమ్మురేపింది. టీమిండియా బిగ్ హిట్టర్లను ఎలా కట్టడి చేయాలో విశాఖలో చేసి చూపించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వరల్డ్ కప్‌కు ముందు జేమ్స్ నీషమ్‌కు ఒక్క చాన్స్ అయినా ఇస్తారా? చూడాలి. మిగతా లైనప్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా రచిన్ రవీంద్ర ఫామ్‌పై ఆందోళన ఉంది. టిమ్ సిఫర్ట్, డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్‌పై బ్యాటింగ్ భారం పడనుంది. కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. బ్రేస్‌వెల్, జేమీసన్, హెన్రీ, డఫీ కూడా చెలరేగితే ఇండియాను కట్టడి చేయడం పెద్దగా కష్టం కాదు. ఫెర్గూసన్ ఆడటం ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది. ఇక త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. దాంతో ఈ పోరులోనూ భారీ స్కోర్లు నమోదయ్యే చాన్స్ ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు టీ20ల్లో ఇండియా
మూడింటిలో గెలిచింది.
