కివీస్‌‌‌‌ను కొట్టాలె .. న్యూజిలాండ్ తో ఇండియా సెమీఫైనల్

కివీస్‌‌‌‌ను కొట్టాలె .. న్యూజిలాండ్ తో ఇండియా సెమీఫైనల్
  • నేడు న్యూజిలాండ్ తో ఇండియా సెమీఫైనల్

వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా తొమ్మిదికి తొమ్మిది విజయాలు సాధించి ఉండొచ్చు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసి ఉండొచ్చు. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపెట్టి ఉండొచ్చు. కానీ, ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క!  గత తొమ్మిది అడుగులు ఒకెత్తయితే ఇప్పుడు వేయబోయే రెండడుగులే టీమిండియాకు వరల్డ్‌ కప్‌ను అందించనున్నాయి.!  ఇందులో తొలి అడుగును బలంగా వేసేందుకు నేడు వాంఖడేలో జరిగే సెమీఫైనల్లో న్యూజిలాండ్‌‌‌‌తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. 

ఫుల్ జోష్​లో ఉన్న రోహిత్​సేన గత వరల్డ్ కప్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో ఓటమికి ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో టోర్నీ ఆరంభించిన విలియమ్సన్‌‌‌‌ సేన తర్వాత తడబడి కష్టంగా సెమీస్‌‌‌‌ బెర్తు దక్కించుకుంది. కానీ, కివీస్ అంటేనే  పట్టుదలకు, పోరాటానికి మారు పేరు. మరి, ఆధిపత్యానికి, పట్టుదలకు మధ్య జరిగే ఈ పోరాటంలో నెగ్గేదెవరో.. మొదటగా ఫైనల్లో అడుగు పెట్టేదెవరో...!

ముంబై: ఖతర్నాక్ ఆటతో, కనికరమే లేకుండా లీగ్ దశలో  తొమ్మిది జట్లను చిత్తు చేసిన టీమిండియా  వరల్డ్​ కప్‌‌‌‌నకు మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. మన జట్టు ముచ్చటగా మూడోసారి కప్పు నెగ్గేందుకు తొలి అడ్డుగా ఉన్న న్యూజిలాండ్‌‌‌‌తో  బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో  పోటీ పడనుంది. రోహిత్​సేన వరుస విజయాలతో జోరు మీద ఉన్నప్పటికీ కివీస్ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. 

2019 వరల్డ్ కప్‌‌‌‌ సెమీస్​లో కివీస్ చేతిలో ఓటమి టీమ్‌‌‌‌ను, ఫ్యాన్స్‌‌‌‌ను ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. రెండేండ్ల కిందట డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియాను బ్లాక్​క్యాప్స్​ టీమ్​ దెబ్బకొట్టింది. వాంఖడేలో కివీస్‌‌‌‌ను కొడితే ఆ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడంతో పాటు కప్పుకు మరింత చేరువ అవ్వొచ్చు. గత రెండు ఎడిషన్లలో సెమీఫైనల్లో ఓడిన టీమిండియా ఈ టోర్నీలో తిరుగులేని ఆటతో అంచనాల ఒత్తిడిని అధిగమించింది. కానీ, వాంఖడే స్టేడియంలో ఏదైనా పోరపాటు జరిగితే దాన్ని కోట్లాది హృదయాలు బద్దలవుతాయని రోహిత్​సేనకు తెలుసు. కాబట్టి దేశం మొత్తం తమపై ఉంచిన అపారమైన అంచనాల భారాన్ని అధిగమించడం కీలకం కానుంది. 

టాస్‌‌‌‌ నుంచే కీలకం

ఈ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా టాస్‌‌‌‌ నుంచి సరైన ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాంఖడేలో సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ చేసిన జట్లు ఆరంభంలో వికెట్లు కోల్పోతున్నాయి. ఫ్లడ్ లైట్స్‌‌‌‌ కింద కొత్త బాల్ గాల్లో ప్రమాదకరంగా మూవ్‌‌‌‌ అవుతోంది. ఇరు జట్లలోనూ కొత్త బాల్‌‌‌‌తో దెబ్బకొట్టే బౌలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్, గిల్‌‌‌‌ ఇచ్చే ఆరంభం ఇండియాకు కీలకం కానుంది. టోర్నీలో ఇప్పటికే 503 రన్స్ చేసిన కెప్టెన్ రోహిత్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. ఏడు మ్యాచ్​ల్లో 270 రన్స్ చేసిన గిల్‌‌‌‌ కివీస్‌‌‌‌పై మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌తో ఆకట్టుకోవాలని ఆశిస్తున్నాడు. 

కింగ్ విరాట్ కోహ్లీ 593 రన్స్‌‌‌‌ తో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. వన్డేల్లో 50 సెంచరీల మైలురాయి అతని కోసం వేచి చూస్తోంది. టీమ్‌‌‌‌ను గెలిపిస్తూ ఈ ఘనత అందుకుంటే విరాట్‌‌‌‌కు అంతకుమించిన ఆనందం మరోటి ఉండబోదు. 2015, 2019 వరల్డ్ కప్‌‌‌‌ సెమీస్​ల్లో నిరాశ పరిచిన తను ఈసారి అదరగొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. సెమీస్‌‌‌‌కు ముందు మిడిలార్డర్  బ్యాటర్లు అయ్యర్, రాహుల్​ సెంచరీలతో టాప్​ ఫామ్​లోకి రావడం శుభసూచకం. అయితే సూర్యకుమార్ బ్యాట్ నుంచి కూడా మెరుపులు అవసరం. బుమ్రా, కుల్దీప్, జడేజా ఎప్పటిలాగే ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నా..  తన పవర్ ఫుల్ పేస్‌‌‌‌తో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ అభిమానుల మది దోచేస్తున్నారు. ఈ టోర్నీలో ఫ్లాట్ వికెట్లపై టీమిండియా బౌలర్ల మాస్టర్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌ను ఎవ్వరూ మ్యాచ్‌‌‌‌ చేయలేకపోతున్నారు. ఇదే జోరును బౌలర్లు ఇంకో రెండు మ్యాచ్‌‌‌‌ల్లో కొనసాగించాలని అంతా ఆశిస్తున్నారు. 

అండర్‌‌డాగ్‌‌‌‌గా కివీస్‌‌‌‌

వరుసగా నాలుగు విజయాలతో టోర్నీని మొదలు పెట్టిన కివీస్ తర్వాత నాలుగింటిలో ఓడి ఒక్కసారిగా డీలా పడింది. చివరి లీగ్‌‌‌‌ పోరులో లంకను ఓడించి కష్టంగా సెమీస్ బెర్తు దక్కించుకున్న విలియమ్సన్‌‌‌‌ సేన అండర్‌‌‌‌‌‌‌‌డాగ్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. ఇండియాతో పోలిస్తే అంత ఆత్మవిశ్వాసంతో లేకపోయినా బ్లాక్‌‌‌‌క్యాప్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆ టీమ్ పేస్ త్రయం ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్ తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ శాంట్నర్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాబోదు.  లీగ్‌‌‌‌ దశలో ధర్మశాలలో ఇండియా చేతిలో ఆ టీమ్‌‌‌‌ ఓడినప్పటికీ బలంగా పుంజుకోవడంలో కివీస్‌‌‌‌ ఎప్పుడూ ముందుంటుంది. 

తీవ్ర ఒత్తిడిలో మెరుగ్గా ఆడగలగడం ఆ టీమ్ ప్రత్యేకత. అందుకు తగిన అనుభవం, నైపుణ్యం వారికి ఉంది. ధోనీ మాదిరిగా మైదానంలో ప్రశాంతంగా ఉండే  విలియమ్సన్‌‌‌‌ కెప్టెన్సీ, బ్యాటింగ్‌‌‌‌ వారికి కీలకం. అతనితో పాటు ఇండియా బౌలర్లను మెరుగ్గా ఎదుర్కొనే అనుభవం, బ్యాటింగ్‌‌‌‌ లోతు ఆ టీమ్‌‌‌‌కు ఉంది. ముఖ్యంగా యువ ఆటగాడు రాచిన్ రవీంద్ర (565 రన్స్‌‌‌‌) ఈ టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌లోనూ తను కీలకం కానున్నాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే భారీ స్కోరుపై కన్నేశాడు.  విలియమ్సన్, డారిల్ మిచెల్, ఫిలిప్స్‌‌‌‌తో  మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ బలంగా ఉంది. ఎనిమిదో నంబర్‌‌‌‌‌‌‌‌ లో వచ్చే శాంట్నర్ సైతం భారీ షాట్లతో మ్యాచ్‌‌‌‌ను మలుపు తిప్పగలడు.  అయితే, జోరు మీదున్న ఇండియా బౌలర్లను వీళ్లు ఏమేరకు అడ్డుకుంటారో చూడాలి.

పిచ్‌‌‌‌/వాతావరణం


వాంఖడే స్టేడియం వికెట్‌‌‌‌ మొదటి ఇన్నింగ్స్‌‌‌‌లో బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఛేజింగ్‌‌‌‌లో 20 ఓవర్లు పూర్తయిన తర్వాత మళ్లీ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఈ మధ్యలో బౌలర్ల ప్రభావం ఉంటుంది. కాబట్టి టాస్ కీలకం కానుంది. బుధవారం వాన సూచన లేదు.