Cricket World Cup 2023: AC వేసుకొని ఇంట్లో కూర్చోండి.. నన్ను ఇబ్బంది పెట్టకండి: ఫ్యాన్స్‌కు సూర్య సందేశం

Cricket World Cup 2023: AC వేసుకొని ఇంట్లో కూర్చోండి.. నన్ను ఇబ్బంది పెట్టకండి: ఫ్యాన్స్‌కు సూర్య సందేశం

దేశమంతటా భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్ మొదలైపోయింది. ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకా 24 గంటల సమయం మిగిలివున్నా.. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా దాయాదుల పోరు గురుంచే డిస్కషన్. ఎవరికివారు ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టేది అనేది కూడా చెప్పేస్తున్నారు. ఒకవైపు ఇలా ఉంటే.. మరోవైపు ఈ మ్యాచ్ వల్ల భారత క్రికెటర్లకు ఇబ్బందులు ఎక్కువయ్యాయట.

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడటం కోసం టికెట్లు కావాలని క్రికెటర్లకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయట. ఉదయాన్నే లేచింది మొదలు కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానుల నుంచి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయట. ఈ క్రమంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టికెట్ల అడిగేవారిని ఉద్దేశిస్తూ సందేశం పంపాడు. ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడండి.. కానీ, నన్ను మాత్రం వదిలేయండి బాబోయ్.. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.

ALSO READ: Cricket World Cup 2023: ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
 

"భైలోగ్ ఘర్ పే అచ్చే టీవీ హై సబ్కే, కరో ఔర్ ఏసీ మే బైత్కే మ్యాచ్ దేఖో.. దయచేసి టికెట్లు మాత్రం అడగకండి.." అని సూర్య టికెట్లు అడిగేవారిని అభ్యర్థించాడు. వీరి పిచ్చి కానీ, లక్ష మంది నడుమ టీవీలో వీరెక్కడ కనపడతారండి .. ఇంట్లో కూర్చొని హాయిగా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయక.

11వేల మందితో భద్రత

భారత్- పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. 48 గంటల పాటు అహ్మదాబాద్ నగరం మొత్తం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోనుంది. 11 వేల మందితో ఈ మ్యాచ్ కు భద్రత కల్పించనున్నారు. ఇందులో స్థానిక పోలీసులు, హోమ్ గార్డులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండనున్నారు. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ సంబంధ దాడులను కూడా అడ్డుకునేలా భద్రతా సిబ్బందిని భారీగానే మోహరిస్తున్నారు.