సిరీస్ పై గురి..ఇవాళ సౌతాఫ్రికాతో మూడో టీ20

సిరీస్ పై గురి..ఇవాళ సౌతాఫ్రికాతో మూడో టీ20

టీ20 ప్రపంచకప్‌‌కు సమయం దగ్గరపడుతున్నా.. ఆడే మ్యాచ్‌‌ల సంఖ్య తక్కువగా ఉన్నా.. టీమిండియా మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు..! నాలుగైదు చాన్స్‌‌ల్లోనే చోటు సుస్థిరం చేసుకోవాలని కోహ్లీ చెప్పినట్లుగా.. ఇప్పుడున్న కుర్రాళ్లనే మరో మ్యాచ్‌‌కు కొనసాగించేందుకు సిద్ధమైంది..! ఈ నేపథ్యంలో నేడు సౌతాఫ్రికాతో జరిగే మూడో టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది..! మొహాలీలో మీసం మెలేసినా విరాట్‌‌.. ఇప్పుడు తన ఇలాకా బెంగళూరులో సిరీస్‌‌ను సాధిస్తాడా? లేక సఫారీలకు పుంజుకునే చాన్స్‌‌ ఇస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది..!!

బెంగళూరుబ్యాటింగ్‌‌ లైనప్‌‌లో సమస్యలు తీరకపోయినా.. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌తో చెలరేగుతున్న టీమిండియా.. పొట్టి ఫార్మాట్‌‌లో మరో సిరీస్‌‌పై కన్నేసింది. ఆదివారం జరిగే మూడో టీ20లో సౌతాఫ్రికాపై గెలిచి సిరీస్‌‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి టీ20 వర్షార్పణం కావడంతో.. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ప్రస్తుతం విరాట్‌‌సేన 1–0 ఆధిక్యంలో ఉంది. కాసేపు ఈ మ్యాచ్‌‌ను పక్కనబెడితే.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌‌ కప్‌‌ వరకు ఇండియా మరో 25 మ్యాచ్‌‌లు ఆడనుంది. ఆలోపే నాలుగో నంబర్‌‌కు సరైన ప్లేయర్‌‌ను వెతికి పట్టుకోవడంతో పాటు, ఫామ్‌‌తో ఇబ్బందిపడుతున్న రిషబ్‌‌ను గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే టీమ్‌‌లో చోటు కోసం ఎదురుచూస్తున్న కుర్రాళ్లకు  సరైన అవకాశాలు కూడా ఇవ్వడం మేనేజ్‌‌మెంట్‌‌ ముందున్న అతిపెద్ద టాస్క్‌‌.

మార్పుల్లేవు..!

మూడో టీ20 కోసం ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో మార్పులు చేయడం లేదు. గత 10 మ్యాచ్‌‌ల్లో ఏడుసార్లు సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోర్లకే పరిమితమైన రిషబ్‌‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు. అయితే లైనప్‌‌లో మార్పులు చేసి శ్రేయస్‌‌ను నాలుగో నంబర్‌‌లోకి తీసుకొచ్చి..  రిషబ్‌‌కు ఫినిషింగ్‌‌ బాధ్యతలను అప్పగించొచ్చు.  ఓపెనింగ్‌‌లో ధవన్‌‌ గాడిలో పడినా.. రోహిత్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించాల్సిన అవసరం ఉంది.  కోహ్లీ బ్యాటింగ్‌‌కు సమాధానం చెప్పే సత్తా సఫారీలకు లేకుండా పోతున్నది. దీనికితోడు సొంతగడ్డపై మ్యాచ్‌‌ జరుగుతుండటంతో.. కెప్టెన్‌‌ నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌‌ను ఆశిస్తున్నారు. మిడిలార్డర్‌‌లో అయ్యర్‌‌ నిలకడకు హార్దిక్‌‌, జడేజా అండగా నిలిస్తే భారీ స్కోరు సాధ్యమే.  గత మ్యాచ్‌‌లో ఒకే ఒక్క ఓవర్‌‌ వేసిన క్రునాల్‌‌ను పక్కనబెడితే.. లెగ్‌‌ స్పిన్నర్‌‌ రాహుల్‌‌ చహర్‌‌కు చోటు దక్కొచ్చు. పేస్‌‌ బౌలింగ్‌‌లో దీపక్‌‌ చహర్‌‌, సైనీ మేనేజ్‌‌మెంట్‌‌ అంచనాలు అందుకోవడం శుభసూచకం. అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేకపోయినా ఈ ఇద్దరు..  బుమ్రా, భువనేశ్వర్‌‌ను మరిపిస్తున్నారు. వీళ్లకు తోడు సుందర్‌‌ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు.

పరువు కోసం..

మరోవైపు సఫారీల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈ మ్యాచ్‌‌లో గెలిచి సిరీస్‌‌ను సమం చేసి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. టీమ్‌‌లో అనుభవజ్ఞులు లేకపోవడం అతిపెద్ద లోటుగా కనిపిస్తున్నది. కొత్త కెప్టెన్‌‌ డికాక్‌‌, మిల్లర్‌‌పైనే బ్యాటింగ్‌‌ భారం పడుతున్నది. ఈ ఇద్దరికి ఇక్కడ ఆడిన అనుభవం ఉండటం కలిసొచ్చే అంశమే అయినా.. ఇతరుల నుంచి సరైన సహకారం అందడం లేదు. ఈ మ్యాచ్‌‌లో ఒకటి, రెండు మార్పులు తప్పకపోవచ్చు. డుప్లెసిస్‌‌ లేకపోవడంతో యంగ్‌‌ మిడిలార్డర్‌‌ ఒత్తిడిని జయించలేకపోతున్నది. ఒక్కరు ఔటైతే బ్యాటింగ్‌‌ లైనప్‌‌ పేకమేడలా కూలడం ఆందోళన కలిగిస్తున్నది. డుసెన్‌‌ నిలకడగా ఆడుతున్నా.. భారీ హిట్టింగ్‌‌ చేయడం లేదు. బవ్యూమా టెక్నికల్‌‌గా ఆడుతున్నా భారీ ఇన్నింగ్స్‌‌గా మల్చలేకపోతున్నాడు. బ్యాటింగ్‌‌తో పోలిస్తే బౌలింగ్‌‌ సూపర్‌‌గా ఉంది. రబడ, జూనియర్‌‌ డలా, పెహుల్‌‌క్వాయో, ప్రిటోరియస్‌‌, ఫోర్టిన్‌‌ చెలరేగితే ఇండియాకు కొద్దిగా కష్టాలు తప్పవు.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, ధవన్‌‌, శ్రేయస్‌‌, పంత్‌‌, హార్దిక్‌‌, క్రునాల్‌‌ / రాహుల్‌‌, జడేజా, సుందర్‌‌, దీపక్‌‌, సైనీ.

సౌతాఫ్రికా: డికాక్‌‌ (కెప్టెన్‌‌), హెండ్రిక్స్‌‌, డుసెన్‌‌, బవ్యూమా, మిల్లర్‌‌, పెహుల్‌‌క్వాయో, ప్రిటోరియస్‌‌, ఫోర్టిన్‌‌, రబడ, జూనియర్‌‌ డలా, షంసీ.

పిచ్‌‌, వాతావరణం

బ్యాటింగ్‌‌కు అనుకూలం. మంచి బౌన్స్‌‌ ఉంటుంది. చిన్న బౌండరీ లైన్‌‌ కారణంగా స్పిన్నర్లకు ఇబ్బందులు తప్పవు. వర్షం ముప్పు ఉంది.

రా. 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి