సిరీస్‌పై గురి..ఇవాళ విండీస్ తో రెండో టీ20

సిరీస్‌పై గురి..ఇవాళ విండీస్ తో రెండో టీ20
  • బౌలింగ్‌‌ను ఇంప్రూవ్‌‌ చేసుకోవడంపై దృష్టి  
  • గెలిచి సిరీస్‌‌లో నిలవాలని విండీస్‌‌ ఆరాటం
  • తిరువనంతపురంలో సెకండ్‌‌ టీ20 నేడు
  • రా. 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

తిరువనంతపురం:  తిరుగులేని బ్యాటింగ్‌‌తో భాగ్యనగరంలో ఫస్ట్‌‌ షోలో సూపర్‌‌ హిట్‌‌ కొట్టిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌‌పై గురి పెట్టింది. వెస్టిండీస్‌‌తో మూడు టీ20ల్లో భాగంగా ఆదివారం ఇక్కడి గ్రీన్‌‌ఫీల్డ్‌‌ ఇంటర్నేషనల్‌‌ స్టేడియంలో జరిగే సెకండ్‌‌ మ్యాచ్‌‌లోనూ  గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇక్కడే సిరీస్‌‌ పట్టేసి.. చివరి మ్యాచ్‌‌లో మరిన్ని  ప్రయోగాలు చేయాలని కోహ్లీసేన కోరుకుంటోంది. మరోవైపు గత పది మ్యాచ్‌‌ల్లో తొమ్మిదో ఓటమి మూటగట్టుకున్న విండీస్‌‌ ఇప్పుడైనా గెలుపు బాట పట్టాలని ఆశిస్తోంది. బ్యాటింగ్‌‌తో పాటుబౌలింగ్‌‌లో కూడా మెప్పిస్తేనే  కరీబియన్లు సిరీస్‌‌లో నిలువగలదు.

బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌పైనే బెంగ

బ్యాటింగ్‌‌లో ఇండియా తిరుగులేని శక్తిగా మారింది. ముఖ్యంగా ఛేజింగ్‌‌లో ఈ మధ్య  చెలరేగి ఆడుతోన్న కోహ్లీసేన తొలి మ్యాచ్‌‌లో తమ హైయెస్ట్‌‌ స్కోరును ఛేజ్‌‌ చేసింది. ఈ విక్టరీలో కోహ్లీ పాత్రను ఎంత పొగిడినా తక్కువే అయినా.. లోకేశ్‌‌ రాహుల్‌‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌‌ చేశాడు. ఆరంభంలోనే వికెట్‌‌ పడ్డ తర్వాత రన్‌‌రేట్‌‌ తగ్గకుండా చూసుకుంటూ  అద్భుత ఇన్నింగ్స్‌‌ ఆడిన రాహుల్‌‌  రెగ్యులర్‌‌ ఓపెనర్‌‌గా జట్టులో కొనసాగే సత్తా తనకు ఉందని నిరూపించాడు. అదే జోరును ఈ మ్యాచ్‌‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు. ఒత్తిడిలో ఉన్న రిషబ్‌‌ పంత్‌‌ రెండు భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. తనపై విమర్శల దాడి పెరిగిన నేపథ్యంలో మరింత బాధ్యతగా ఆడి,  వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది.  గత మ్యాచ్‌‌ ఫెయిల్యూర్‌‌ నుంచి రోహిత్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ బయటపడితే ఇండియాకు తిరుగుండదు. పంత్‌‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న సంజు శాంసన్‌‌కు చాన్స్‌‌ ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. తన హోమ్‌‌గ్రౌండ్‌‌లో స్పెషలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా శాంసన్‌‌ను ఆడించే అవకాశం లేకపోలేదు.  హైదరాబాద్‌‌లో యుజ్వేంద్ర చహల్‌‌ మినహా మిగతా బౌలర్లు తేలిపోయారు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌‌పై చెలరేగిన దీపక్‌‌ చహర్‌‌, రీఎంట్రీలో భువనేశ్వర్‌‌ నిరాశ పరిచారు.  ముఖ్యంగా  బ్రేక్స్‌‌ ఇస్తాడనుకున్న వాషింగ్టన్‌‌ సుందర్‌‌ ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. చివరి ఆరు టీ20ల్లో రెండు వికెట్లు మాత్రమే తీసిన అతనిపై వేటు వేసి రిస్ట్‌‌ స్పిన్నర్‌‌  కుల్దీప్‌‌ యాదవ్‌‌ వైపు మేనేజ్‌‌మెంట్‌‌ మొగ్గు చూపొచ్చు. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఫీల్డింగ్‌‌లోనూ ఇండియా ఫెయిలైంది. ఒక్క గేమ్‌‌లో నాలుగు క్యాచ్‌‌లు (సుందర్‌‌, రోహిత్‌‌ చెరో రెండు) వదిలేయడం ఆందోళనకరం.  టీ20 గేమ్‌‌ క్షణాల్లో మలుపు తిరుగుతుంది. ఏ ఒక్క చాన్స్‌‌ మిస్సయినా కోలుకోవడం కష్టం. హెట్‌‌మయర్‌‌, పొలార్డ్‌‌, బ్రెండన్‌‌ కింగ్‌‌ను బౌలర్లు అడ్డుకోకపోతే మూల్యం తప్పదు. అన్ని సార్లు కోహ్లీపైనే భారం వేయలేం.

విండీస్‌‌ పుంజుకుంటుందా?

ప్రపంచంలో ఏ మూల టీ20 లీగ్‌‌ జరుగుతున్న విండీస్‌‌ ఆటగాళ్లు బరిలో నిలుస్తున్నారు. దాంతో, నేషనల్‌‌ టీమ్‌‌కు ఆడే నాణ్యమైన ప్లేయర్లు కరువయ్యారు. ఆ కారణంగానే టీ20 చాంపియన్ల ఆట గాడి తప్పింది. అయినా పవర్‌‌ హిట్టర్లకు కొదవలేని టీమ్‌‌తో ఇండియాకు వచ్చిన కరీబియన్లు.. ఉప్పల్‌‌లో భారీ స్కోరు చేసి ఇండియాకు షాకిస్తారనిపించింది. కానీ, విరాట్‌‌ కోహ్లీ మాస్టర్‌‌ క్లాస్‌‌ ఇన్నింగ్స్‌‌తో వారికి దిమ్మతిరిగింది.  ఈ ఓటమిలో విండీస్‌‌ మిస్టేక్స్‌‌ కూడా చాలానే ఉన్నాయి. వాళ్ల బౌలింగ్‌‌ కూడా చాలా దారుణంగా కనిపించింది. ఏకంగా 23 ఎక్స్‌‌ట్రాలు ఇచ్చుకుందా జట్టు. దీనిపై కెప్టెన్‌‌ పొలార్డ్‌‌ దృష్టి సారించాలి.  కోహ్లీ దెబ్బకు కెస్రిక్‌‌ విలియమ్స్‌‌ టీ20ల్లో విండీస్‌‌ తరఫున వరస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసిన బౌలర్‌‌గా నిలిచాడు. అయినా.. కట్టర్స్‌‌, పేస్‌‌ వేరియేషన్స్‌‌, మంచి స్ట్రయిక్‌‌ రేట్‌‌ దృష్యా  అతడిని తప్పించకపోవచ్చు. సీనియర్‌‌ బౌలర్లు జేసన్‌‌ హోల్డర్‌‌, షెల్డన్‌‌ కాట్రెల్‌‌ రాణించాలని విండీస్‌‌  కోరుకుంటోంది. ఉప్పల్‌‌లో ఓడినా కెప్టెన్‌‌ పొలార్డ్‌‌, హెట్‌‌మయర్‌‌, బ్రెండన్‌‌ కింగ్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించడం ఆ జట్టుకు ప్లస్‌‌ పాయింట్‌‌. పైగా, బాల్‌‌ ట్యాంపరింగ్‌‌ కేసులో నాలుగు మ్యాచ్‌‌ల బ్యాన్‌‌ ముగియడంతో వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ నికోలస్‌‌ పూరన్‌‌ బరిలోకి దిగుతున్నాడు. రామ్‌‌దిన్‌‌ ప్లేస్‌‌లో అతని రాకతో విండీస్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌ మరింత బలంగా మారనుంది. మరి, ఈ మ్యాచ్‌‌లో గెలిచి ఆ జట్టు సిరీస్‌‌లో నిలుస్తుందో లేదో చూడాలి.

పిచ్‌‌, వాతావరణం

గ్రీన్‌‌ఫీల్డ్‌‌ స్టేడియం పిచ్‌‌ బౌలింగ్‌‌కు అనుకూలం. ముఖ్యంగా స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపుతారు. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నీలో భాగంగా ఈ గ్రౌండ్‌‌లో జరిగిన 14 మ్యాచ్‌‌ల్లో స్పిన్‌‌ జోరు నడిచింది. 20.85 యావరేజ్‌‌తో ఓవర్‌‌కు 6.35 రన్స్‌‌ మాత్రమే ఇచ్చారు. ఈ గ్రౌండ్‌‌లో గతేడాడి వెస్టిండీస్‌‌తో జరిగిన వన్డేలో 104 రన్స్‌‌కే కుప్పకూలిన ఇండియా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.  2017లో  న్యూజిలాండ్‌‌తో ఏకైక టీ20లో (వర్షం కారణంగా ఎనిమిదేసి ఓవర్ల ఆటే సాధ్యమైంది) ఇండియా గెలిచింది. ఆదివారం కూడా కొద్దిపాటి వర్షం కురిసే చాన్సుంది. వాతావరణం కాస్త వేడిగా ఉండనుంది.

జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్‌‌, రాహుల్‌‌, కోహ్లీ (కెప్టెన్‌‌), పంత్‌‌ (కీపర్), అయ్యర్‌‌, దూబే/శాంసన్‌‌, జడేజా, కుల్దీప్‌‌, దీపక్‌‌, భువనేశ్వర్‌‌, చహల్‌‌.

వెస్టిండీస్‌‌: సిమ్మన్స్‌‌, లూయిస్‌‌, బ్రెండన్‌‌ కింగ్‌‌, హెట్‌‌మయర్‌‌, పూరన్‌‌ (కీపర్‌‌), పొలార్డ్‌‌ (కెప్టెన్‌‌), హోల్డర్‌‌, పైర్‌‌, కెస్రిక్‌‌, కాట్రెల్‌‌, హేడెన్‌‌ వాల్ష్‌‌.