- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్‌లో లైవ్
- గాయంతో శాంసన్ ఔట్
పుణె: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌పై గురి పెట్టింది. శ్రీలంకతో గురువారం ఇక్కడ జరిగే రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకొని ఆఖరి మ్యాచ్‌ను ప్రయోగాలకు వేదికగా మార్చుకోవాలని చూస్తోంది. అదే సమయంలో తొలి టీ20లో చేసిన కొన్ని మిస్టేక్స్‌ను సరిదిద్దుకోవాలని ఆశిస్తోంది. వాంఖడే హైస్కోరింగ్ వికెట్‌పై సాధారణ స్కోరుకే పరిమితమైన పాండ్యాసేన ఆపై, లంకను ఆదిలోనే దెబ్బకొట్టినా తర్వాత పట్టు విడిచింది. చివరి బాల్ వరకు విజయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం జట్టుకు లాభిస్తుందని కెప్టెన్ పాండ్యా చెబుతున్నాడు. అది నిజమే అయినా అనవసరంగా అలాంటి పరిస్థితిని కల్పించుకోవడం ఎందుకన్న ప్రశ్న వస్తోంది. ఈ నేపథ్యంలో పవర్‌ప్లేలో మెరుగ్గా ఆడటంతో పాటు మిడిల్ ఓవర్ల బౌలింగ్‌లో ఇంప్రూవ్ అవడంపై పుణెలో ఇండియా దృష్టి పెట్టనుంది.
ఈ నేపథ్యంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌పై ఫోకస్ ఉండనుంది. వాంఖడేలో ఈ ఇద్దరూ నిరాశ పరిచారు. తన తొలి టీ20లో గిల్ పవర్ ప్లేకు తగ్గట్టు ఆడలేక వికెట్ పారేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ రూపంలో మరో నాణ్యమైన ఓపెనర్ నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో మరోసారి ఫెయిలైతే తుది జట్టులో గిల్ చోటుకు గ్యారంటీ ఉండబోదు. ఐపీఎల్లో కేకేఆర్, గుజరాత్ తరఫున ఓపెనింగ్ చేసిన గిల్ కుదురుకునేందుకు టైం తీసుకొని ఆ తర్వాత చెలరేగేవాడు. ఇలాంటి అప్రోచ్ వల్లే టీ20 టీమ్‌లో కేఎల్ రాహుల్ ప్లేస్‌కు ఎసరొచ్చింది. కాబట్టి ఈ ఫార్మాట్‌కు తగ్గట్టు తొలి ఓవర్ నుంచే భయం లేకుండా, దంచికొట్టాల్సిన అవసరం ఉంది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉండటం ప్లస్ పాయింట్. గత పోరులో ఫెయిలైన సూర్యకుమార్ గాడిలో పడాల్సి ఉంది. ఇక, తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ మోకాలి గాయానికి గురైన సంజు శాంసన్ ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతని ప్లేస్‌లో విదర్భ కీపర్ జితేశ్ శర్మను సెలెక్టర్లు టీమ్‌లో చేర్చారు. అయితే, శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠి టీ20 డెబ్యూ చేసే అవకాశం ఉంది. హార్దిక్, హుడా, అక్షర్ పటేల్ అదే జోరు కొనసాగిస్తే టీమ్‌కు తిరుగుండదు. ఇక, బౌలింగ్‌లో డెబ్యూ పేసర్శివం మావి వాంఖడేలో అద్భుత పెర్ఫామెన్స్ చేశాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన తను కొత్త బాల్‌తో మ్యాజిక్ చేసి జట్టుకు అవసరం అయిన వికెట్లు ఇచ్చాడు. తొలి పోరులో తనే హీరో అనొచ్చు. అతనికి కెప్టెన్ పాండ్యా, మరో యంగ్‌స్టర్ ఉమ్రాన్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. అయితే, మెయిన్ స్పిన్నర్ చహల్ ఫెయిలవడం వల్లే ఇండియా విజయం కోసం చివరి బాల్ దాకా పోరాడాల్సి వచ్చింది. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే చాన్స్ రాకపోవడంతో చహల్ డీలా పడ్డాడు. అయితే, ఇప్పుడు జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఉన్న దృష్ట్యా తన మార్కు చూపెట్టకపోతే చహల్ మొత్తం టీమ్ నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉంది. పేసర్ హర్షల్ కూడా మెరుగైతే మంచిది.