ఆ రోజు పాక్ ఆర్మీపై బాంబుల వాన కురిసేది

ఆ రోజు పాక్ ఆర్మీపై బాంబుల వాన కురిసేది

న్యూఢిల్లీ: ‘ఆ రోజు బోర్డర్​కు దగ్గర్లోని టెర్రరిస్టు స్థావరాలే మా టార్గెట్.. పాక్​ సైన్యంపై దాడులు చేయాలని అనుకుంటే బ్రహ్మోస్​ మిస్సైల్స్​ వాడే వాళ్లం’ అని రిటైర్డ్​ ఎయిర్​ చీఫ్ మార్షల్​ బీఎస్​ ధనోవా చెప్పారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చండీగఢ్​లో జరిగిన మిలిటరీ లిటరేచర్​ ఫెస్టివల్​లో పాల్గొన్న ధనోవా.. బాలాకోట్​ దాడి సంగతులను చెప్పుకొచ్చారు. పాక్​ సైన్యంపై దాడులు చేయాలని తాము అనుకోలేదన్నారు.టెర్రర్​ క్యాంపులను ధ్వంసం చేసిన మరుసటి రోజు రాజౌరీ, పూంచ్​ సెక్టార్లలోని మన సైనిక స్థావరాలపై పాక్​ ఆర్మీ దాడులకు ప్రయత్నించిందని గుర్తుచేశారు. తన సైనిక సామర్థ్యానికి ఆ దాడులు ఓ ఉదాహరణగా పాక్​ ప్రభుత్వం చెప్పుకుంటోందన్నారు. అయితే, ఆ దాడులు ఫెయిల్​ కావడం పాక్​కు మేలు చేసిందన్నారు. ఆ దాడుల్లో ఏ ఒక్కటి సక్సెస్​ అయినా పాక్​ ఆర్మీపై మిస్సైల్​వర్షం కురిపించేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు. దాంతో  రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యేదని ధనోవా వివరించారు. జైషే క్యాంపులపై జరిగిన దాడిలో ఎయిర్​ఫోర్స్​ టార్గెట్​ గురితప్పిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై ధనోవా స్పందిస్తూ ఎయిర్​ ఫోర్స్​ను వెనకేసుకువచ్చారు. బాలాకోట్ దాడులు అత్యంత పకడ్బందీగా చేశామని, ముందు అనుకున్నట్లే క్యాంపులను తుడిచిపెట్టేశామని చెప్పారు.