
- వీటితో ఆర్థిక వ్యవస్థకూ మేలు
- వెల్లడించిన రిపోర్ట్
న్యూఢిల్లీ: మనదేశంలో 2032 నాటికి 12.3 కోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్డుపైకి వస్తాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ మంగళవారం విడుదల చేసిన రిపోర్ట్ తెలిపింది. "ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఓవర్వ్యూ" పేరుతో ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలంటే పెద్ద ఎత్తున ఈవీలు కావాలి. 2030 నాటికి మొత్తం బండ్లలో ఈవీల వాటా 30 శాతానికి చేరుతుంది. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలుగుతాయి. ఫేమ్–2 వంటి ప్రభుత్వ పథకాలు ఈవీల పెరుగుదలకు ఎంతో సాయపడ్డాయి. ఇవి ఎలక్ట్రిక్ టూవీలర్స్, త్రీవీలర్స్, ఫోర్వీలర్లకు ప్రోత్సాహకాలను, అలాగే పబ్లిక్ చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం మూలధన సబ్సిడీలను అందించాయి. జాతీయ ఈవీ లక్ష్యాల (ఎన్ఈవీ)ను సాధించడానికి ఉపయోగపడుతున్నాయి.
పర్యావరణ అనుకూల రవాణాను పెంచడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మనదేశం కట్టుబడి ఉందని చాటిచెప్పాయి. 2030 నాటికి, 80 శాతం టూవీలర్లు, త్రీవీలర్లు ఈవీలే ఉంటాయి. కమర్షియల్కార్లలో 70 శాతం, బస్సుల్లో 79 శాతం ఎలక్ట్రిక్వే ఉంటాయి. గత ఏడాది మొత్తం ఈవీల్లో 93 శాతం వాటా టూ, త్రీవీలర్లదే ఉంది. ఫోర్వీలర్ల వాటా ఆరు శాతం వరకు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల వాటా ఒకశాతం కంటే తక్కువగా ఉంది. 2024లో భారతదేశంలో దాదాపు 76 వేల క్యుములేటివ్ పబ్లిక్ క్యాప్టివ్ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 1.3 గిగావాట్లని ఈ రిపోర్టు వెల్లడించింది.
ఏప్రిల్‌లో 56.87 శాతం పెరిగిన ఈవీ అమ్మకాలు
దేశవ్యాప్తంగా గత నెల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు 56.87 శాతం పెరిగి 12,233 యూనిట్లకు చేరుకున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం గత ఏడాది ఇదే నెలలో 7,798 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ నెల రెండో తేదీన నాటికి జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 3,462 యూనిట్లను, మహీంద్రా అండ్ మహీంద్రా 2,979 యూనిట్లను అమ్మాయి. టాటా మోటార్స్ మొదటిస్థానంలో కొనసాగుతోంది. గత సంవత్సరం ఇదే నెలలో, టాటా మోటార్స్ 5,177 యూనిట్ల ఎలక్ట్రిక్ పీవీలను, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 1,268 యూనిట్లను, ఎం అండ్ఎం 668 యూనిట్లను అమ్మింది.
హ్యుందాయ్ గత నెలలో 677 ఎలక్ట్రిక్ పీవీలను అమ్మింది. ఇది గత ఏప్రిల్‌లో 91 యూనిట్లు మాత్రమే అమ్మింది. టూవీలర్ విభాగంలో మొత్తం రిటైల్ అమ్మకాలు 40.02 శాతం పెరిగి 91,791 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏప్రిల్‌లో 65,555 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ 19,736 యూనిట్లతో ఆధిక్యాన్ని కొనసాగించింది. ఆ తర్వాత వరుసగా ఓలా ఎలక్ట్రిక్ 19,706 యూనిట్లతో, బజాజ్ ఆటో 19,001 యూనిట్లతో ఆధిపత్యాన్ని చాటాయి.