
- దొరక్క ఇబ్బందిపడుతున్న బీఎఫ్ఎస్ఐ ఇండస్ట్రీ
కాలేజీలు, యూనివర్సిటీలు మెషీన్‌లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకే ప్రాధాన్యం ఇస్తుండటంతో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ తగినంత మంది తయారు కావడం లేదు. దీంతో సంస్థలు.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఇబ్బందిపడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీని బోధించే విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, వాటి సంఖ్య పరిమితంగా ఉంది. ఇప్పటికిప్పుడు కంపెనీలకు 40 వేల మంది ఎక్స్పర్ట్స్ అవసరమని అంచనా.
ముంబై: ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీలకు అత్యంత ముఖ్యమైన మూడు సెగ్మెంట్లలో సైబర్ సెక్యూరిటీ ఒకటి. అయితే పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా ఎక్స్పర్టులు దొరకడం లేదు. సాధారణంగా కంపెనీలు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం వెతుకుతాయి. అయితే ఇది కొత్త విభాగం కావడంతో భారతీయ వర్సిటీలు పరిశ్రమకు అవసరమైనంత నైపుణ్యం కలిగిన ఎక్స్‌పర్టులను తయారు చేయలేకపోతున్నాయి. "మన ఎడ్యుకేషనల్ఇన్స్టిట్యూట్లు ఏఐ, ఎంఎల్, ఇతర డేటా సైన్స్ కోర్సులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీపై ఫోకస్ చేయడం లేదు. సమర్థవంతమైన సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందించే భారతీయ కాలేజీల సంఖ్య చాలా తక్కువ. విదేశీ వర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తితో పోల్చినప్పుడు భారతదేశంలో గ్రాడ్యుయేట్‌కు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి” అని దేశంలోని బడా బ్యాంకులకు సలహాలు ఇచ్చే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు చెందిన అభిషేక్ ఛటర్జీ అన్నారు. తరచూ సైబర్‌దాడులు జరుగుతుండటంతో బ్యాంకులు, బీమా సంస్థలు తమ సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. చాలా కంపెనీల్లో ఓపెనింగ్స్ ఉన్నప్పటికీ క్యాండిడేట్లు దొరకడం లేదు. మనదేశంలో బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌కు ప్రస్తుతం 12వేల యాక్టివ్ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అన్నారు. తమ టీమ్‌తో కలసి పనిచేయడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం చూస్తున్నామని, కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు కావాలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. అనేక ఇతర బ్యాంకులు కూడా సైబర్ నిపుణుల కోసం వెతుకుతున్నాయి కానీ దొరకడం లేదు. "భారతదేశంలో అన్ని రంగాలలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం డిమాండ్ దాదాపు 40 వేల వరకు ఉంది. ఈ డొమైన్‌లో నైపుణ్యం కలిగిన వాళ్లు దొరకడం పెద్ద సవాలుగా మారింది" అని అలుగ్ చెప్పారు.
అనుభవం లేకుంటే కష్టమే..
యంగ్ గ్రాడ్యుయేట్లు హ్యాకథాన్‌లలో పాల్గొనడం ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. తగినంత అనుభవం లేకపోవడమే వారికి అసలు సమస్య. "నేను హ్యాకథాన్‌లలో పాల్గొనడం ద్వారా నా స్కిల్స్‌ను చూపెట్టాను. నన్ను నియమించుకునేలా కంపెనీలను ఒప్పించడం చాలా కష్టంగా ఉంది. విదేశాల్లో నైపుణ్యం ఆధారంగా ఉద్యోగం ఇస్తారు. అనుభవాన్ని బట్టి కాదు” అని ముంబై నుంచి ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఉపమన్యు ఝా అన్నారు. కంపెనీలు, ముఖ్యంగా బ్యాంకులు, సైబర్ టాలెంట్‌ను నియమించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ల డేటాను రక్షించుకోవడం చాలా ముఖ్యం. "కంపెనీలు దేన్నైనా హ్యాండిల్ చేయగల వ్యక్తిని కోరుకుంటాయి. ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవారికి జీతాలు సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉంటాయి" అని టీమ్‌లీజ్ సర్వీసెస్‌కి చెందిన కృష్ణ విజ్ చెప్పారు. ఫ్రెష్గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పరిమితంగా ఉంటాయని అన్నారు. అయితే అభ్యర్థికి తక్కువ అనుభవం ఉన్నప్పటికీ అప్‌గ్రేడ్ కాగల సత్తా ఉంటే ఉద్యోగం ఇస్తున్నాయి. కొంతమంది జూనియర్లు కూడానెట్‌వర్క్‌లో క్లిష్టమైన లోపాలను కనుగొని సత్తా చాటుతున్నారని ఇండస్‌ఫేస్ సీఈఓ ఆశిష్ టాండన్ అన్నారు.