IND vs AUS 1st ODI: టీమిండియా టాపార్డర్ అదరహో.. ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్

IND vs AUS 1st ODI: టీమిండియా టాపార్డర్ అదరహో.. ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్

వరల్డ్ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా ఉమెన్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించింది. ఆదివారం (సెప్టెంబర్ 14) న్యూ చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇండియన్ టాపార్డర్ ప్రతీక్ రావల్, స్మృతి మందాన, హర్లీన్ డియోల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాచ్ రెండు వికెట్లు పడగొట్టింది. కిమ్ గార్త్,  ఆలన కింగ్, సదర్లాండ్, తాహిళ మెగ్రాత్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ మొదట బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో భారత ఓపనర్లు రావల్, స్మృతి మందాన స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లను అలవోకగా ఎదర్కొంటూ పరుగులు రాబట్టారు. క్రీజ్ లో ఉన్నంత వరకు వేగంగా బ్యాటింగ్ చేసిన మందాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు రావల్ క్రీజ్ లో నిలదొక్కోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది. తొలి  వికెట్ కు వీరిద్దరి జోడీ 114 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. హాఫ్ సెంచరీ తర్వాత సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన స్మృతి.. 58 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో ఔటయింది. 

ఈ దశలో డియోల్ తో కలిసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ప్రతీక్ స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పి 64 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (11) నిరాశపర్చింది. రోడ్రిగ్స్ తో కలిసి 46 పరుగులు జోడించిన డియోల్ జట్టు స్కోర్ ను 200 పరుగులకు చేర్చింది. ఈ క్రమంలో హర్లీన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. హర్లీన్ ఔటైన తర్వాత భారత జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఒక దశలో 300 స్కోర్ ఖాయమనుకున్నా ఆస్ట్రేలియా బౌలర్లు చివర్లో అద్భుతంగా రాణించడంతో ఇండియా 280 పరుగులకే పరిమితమైంది.