
- ఫేవరెట్‌గా టీమిండియా
- లెక్క సరిచేయాలన్న పట్టుదలతో ఇంగ్లిష్ జట్టు
- మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
లండన్: ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియా విమెన్స్ టీమ్ ఇప్పుడు వన్డే సిరీస్‌పై గురి పెట్టింది. ఇంగ్లిష్ టీమ్‌తో శనివారం జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో ఉంది. ఇటీవల జరిగిన ట్రై నేషన్స్ సిరీస్ నెగ్గిన ఇండియా.. వన్డే ఫార్మాట్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది. రాబోయే వరల్డ్ కప్ వరకు దాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అయితే జట్టులోకి వచ్చిన ప్రతి ఒక్కరు అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపిస్తుండటంతో వరల్డ్ కప్ టీమ్‌లో చోటు కోసం పోటీ ఎక్కువైంది. టాలెంట్ పుష్కలంగా ఉండటంతో ఎవర్ని ఎంపిక చేయాలన్న తలనొప్పి కూడా మొదలైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా రిజర్వ్ బెంచ్ బలం పెరగడంతో కొన్ని స్థానాల కోసం చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. గాయాల కారణంగా పేసర్లు రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్ లేకపోయినా.. తొలి వన్డేలో ఆడిన క్రాంతి గౌడ్ రాణించడం శుభసూచకం. 21 ఏళ్ల ఈ అమ్మాయి రెండు కీలక వికెట్లు తీసి ఆకట్టుకుంది. కొత్త బాల్‌తో అమన్‌జోత్ కూడా మెరుగ్గా రాణిస్తోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎన్. శ్రీచరణి, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్‌తో స్పిన్ బలగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో స్మృతికి తోడుగా ప్రతీకా రావల్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. హర్లీన్ డియోల్ మూడో ప్లేస్‌కు సరిపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌తో లైనప్ పూర్తిగా నిండిపోయింది. రిషబ్ పంత్ మాదిరిగా ఒంటి చేత్తో సిక్స్ కొట్టిన దీప్తిపై అందరి దృష్టీ నెలకొంది. ఫీల్డింగ్ కూడా మరింత మెరుగుపడితే టీమిండియా
కష్టాలన్నీ తీరినట్లే.
ప్రతీకారం కోసం
సొంతగడ్డపై ఇప్పటికే టీ20 సిరీస్ చేజార్చుకుని విమర్శలపాలైన ఇంగ్లండ్ తొలి వన్డే ఓటమితో మరింత కుంగిపోయింది. దీంతో రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి ప్రతీకారంతో పాటు లెక్క సరి చేయాలని పట్టుదలగా ఉంది. ఇది జరగాలంటే బౌలర్లు మరింత శ్రమించాలి. బ్యాటర్లు భారీ స్కోరును అందించినా బౌలర్లు దాన్ని కాపాడలేకపోతున్నారు. పేసర్లు లారెన్ బెల్, కేట్ క్రాస్‌పై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మిడిల్ మ్యాచ్‌ను కంట్రోలు చేయడంలో ఎకిల్‌స్టోన్, లారెన్ ఫైలర్ విఫలమయ్యారు. మధ్యలో చార్లీ డీన్ రెండు వికెట్లు తీసినా రన్స్‌ను నియంత్రించలేకపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌కు బౌలింగ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్‌లో ఇంగ్లండ్‌కు పెద్దగా ఇబ్బందుల్లేవు. ఓపెనర్లు బ్యూమోంట్, అమీ జోన్స్ గాడిలో పడితే బాగుంటుంది. ఎమ్మా లాంబ్, గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ సివర్ బ్రంట్, డంక్లీ, అలైస్ రిచర్డ్స్, ఎకిల్‌స్టోన్ బ్యాట్లు ఝుళిపిస్తుండటం కలిసొచ్చే అంశం.