రెండో వన్డేలో 7 వికెట్లతో ఇండియా ఘన విజయం

రెండో వన్డేలో 7 వికెట్లతో ఇండియా ఘన విజయం
  • దంచికొట్టిన  శ్రేయస్‌, కిషన్‌    సత్తా చాటిన సిరాజ్‌
  • 1‑1తో సిరీస్‌‌‌‌ సమం

రాంచీ : తొలి మ్యాచ్‌‌ ఓటమికి సౌతాఫ్రికాపై ఇండియా రివెంజ్‌‌ తీర్చుకుంది. శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌ (111 బాల్స్‌‌లో 15 ఫోర్లతో 113 నాటౌట్) క్లాసిక్‌‌ సెంచరీకి తోడు హోమ్​టౌన్​ రాంచీలో యంగ్‌‌స్టర్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ (84 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) కెరీర్‌‌ బెస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌తో రప్ఫాడించడంతో  ఆదివారం జరిగిన రెండో పోరులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. తొలుత హైదరాబాదీ మహ్మద్‌‌  సిరాజ్‌‌ (10–--1–-38-–3) కట్టుదిట్టమైన బౌలింగ్‌‌తో ఆకట్టుకోవడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 278/7 స్కోరు చేసింది. మార్‌‌క్రమ్‌‌ (79), రీజా హెండ్రిక్స్‌‌ (74) సత్తా చాటారు. అనంతరం  అయ్యర్‌‌, ఇషాన్‌‌ మూడో వికెట్‌‌కు 161 రన్స్​ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో ఇండియా 45.5 ఓవర్లలోనే 282/3స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కెరీర్‌‌లో రెండో సెంచరీ సాధించిన శ్రేయస్‌‌ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. సిరీస్‌‌ విజేతను తేల్చే మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. 

హెండ్రిక్స్‌‌, మార్‌‌క్రమ్‌‌ దూకుడు.. సిరాజ్‌‌ కట్టడి టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన సఫారీలకు మూడో ఓవర్లోనే  సిరాజ్‌‌ షాకిచ్చాడు. అతను వేసిన వైడ్‌‌ డెలివరీని వికెట్ల మీదకు ఆడుకొని ఓపెనర్‌‌ డికాక్‌‌(5) బౌల్డ్‌‌ అయ్యాడు. మరో ఓపెనర్‌‌ జనేమన్‌‌ మలన్‌‌ (25)ను పదో ఓవర్లో ఎల్బీ చేసిన డెబ్యూ బౌలర్‌‌ షాబాజ్‌‌ అహ్మద్‌‌ తొలి వికెట్‌‌ ఖాతాలో వేసుకున్నాడు. 40/2తో నిలిచిన ఇన్నింగ్స్‌‌ను హెండ్రిక్స్‌‌, మార్‌‌క్రమ్‌‌ ముందుకు తీసుకెళ్లారు.  ఇద్దరూ నాణ్యమైన షాట్లు ఆడుతూ మూడో వికెట్‌‌కు 129 రన్స్‌‌ జోడించారు. ఈ క్రమంలో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. దాంతో, 169/3తో సఫారీలు భారీ స్కోరు చేసేలా కనిపించారు. ఈ దశలో తెలివిగా ఫీల్డ్‌‌ను సెట్‌‌ చేసి, బౌలర్లను మార్చిన కెప్టెన్‌‌ ధవన్‌‌ 46 రన్స్‌‌ తేడాతో మూడు వికెట్లు రాబట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. 32వ ఓవర్లో షార్ట్‌‌ బాల్‌‌తో హెండ్రిక్స్‌‌ను ఔట్‌‌ చేసిన సిరాజ్‌‌ ఈ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను విడదీశాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో దూకుడుగా కనిపించిన డేంజర్‌‌ మ్యాన్‌‌ క్లాసెన్‌‌ (30) కుల్దీప్‌‌ బౌలింగ్‌‌లో ఇచ్చిన క్యాచ్‌‌ను తనే అద్భుతంగా అందుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే మార్‌‌క్రమ్‌‌ను సుందర్‌‌ పెవిలియన్‌‌ చేర్చడంతో సౌతాఫ్రికా 215/5తో  డీలా పడ్డది. చివరి పది ఓవర్లలో ఇండియా బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేశారు. ముఖ్యంగా సిరాజ్‌‌ షార్ట్‌‌, స్లో బాల్స్‌‌తో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించాడు. దాంతో, మిల్లర్‌‌ (35 నాటౌట్‌‌) సైతం షాట్లు ఆడలేకపోయాడు.  చివరి ఓవర్లో మూడు రన్స్‌‌ మాత్రమే ఇచ్చిన సిరాజ్‌‌ సఫారీలను 280లోపే కట్టడి చేశాడు. 

శ్రేయస్‌‌‌‌, ఇషాన్‌‌ జోరు

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్‌‌ ధవన్‌‌ (13)  ఆరో  ఓవర్లోనే ఔటై  మళ్లీ నిరాశ పరచగా.. గిల్‌‌ (28) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 9వ ఓవర్లో రబాడకు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇవ్వడంతో 48/2తో ఇండియా కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌లో ఇషాన్‌‌, అయ్యర్‌‌ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు.  గత మ్యాచ్‌‌లో ఫెయిలైన ఇషాన్‌‌ ఈసారి బాధ్యతగా ఆడగా..  లోక్నో జోరును శ్రేయస్‌‌ రాంచీలోనూ కొనసాగించాడు.  ముఖ్యంగా క్రీజులో కుదురుకునే దాకా ప్రశాంతంగా కనిపించిన కిషన్‌‌ తనలోని మరో కోణాన్ని చూపెట్టాడు. తర్వాత స్టాండిన్​ కెప్టెన్​, స్పిన్నర్‌‌ కేశవ్‌‌ను టార్గెట్‌‌ చేశాడు. 19వ ఓవర్లో సిక్స్‌‌తో జోరు పెంచిన అతను.. కేశవ్‌‌ తర్వాతి ఓవర్లోనే 2 సిక్సర్లు బాది టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చాడు. మరో ఎండ్‌‌లో శ్రేయస్ క్లాసిక్‌‌ షాట్లతో బౌండ్రీలు రాబట్టారు. ఇద్దరూ 26వ ఓవర్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు.  ఆ తర్వాత కిషన్‌‌ మరింత స్పీడు పెంచాడు. అన్రిచ్‌‌ వేసిన 32వ ఓవర్లో 4, 6, 6తో రెచ్చిపోయాడు. అతని బౌలింగ్‌‌లోనే ఇంకో సిక్స్‌‌తో 90లోకి వచ్చిన ఇషాన్‌‌ కెరీర్‌‌లో తొలి సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, ఫార్చ్యూన్‌‌ బౌలింగ్‌‌లో షాట్‌‌కు ట్రై చేసి హెండ్రిక్స్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. అప్పటికే ఇండియా విజయం ఖాయం అవగా.. సంజు శాంసన్‌‌ (30 నాటౌట్‌‌) తోడుగా లక్ష్యాన్ని కరిగించిన శ్రేయస్‌‌  ఈ క్రమంలో 103 బాల్స్‌‌లో సెంచరీ కూడా అందుకున్నాడు. 

సంక్షిప్త స్కోర్లు

సౌతాఫ్రికా: 50 ఓవర్లో 278/7 (మార్‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ 79, హెండ్రిక్స్‌‌‌‌ 74, సిరాజ్‌‌‌‌ 3/38).
ఇండియా: 45.5 ఓవర్లలో 282/3 (శ్రేయస్‌‌‌‌ 113 నాటౌట్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ 93, పార్నెల్‌‌‌‌ 1/44).