IND vs WI 1st Test: అహ్మదాబాద్ టెస్టు మనదే.. వెస్టిండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

IND vs WI 1st Test: అహ్మదాబాద్ టెస్టు మనదే.. వెస్టిండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం (అక్టోబర్ 4) ముగిసిన ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులు వెనకబడి మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్, జడేజా విండీస్ జట్టును చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అక్టోబర్ 10 నుంచి జరుగుతుంది.

గురువారం (అక్టోబర్ 2) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌‌లో 44.1 ఓవర్లలో 162  రన్స్‌‌కే కుప్పకూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), కెప్టెన్ రోస్టన్ చేజ్‌‌ (24) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. ఇండియా  బౌలర్లలో సిరాజ్ (4/40), బుమ్రా (3/42), కుల్దీప్ (2/25) విండీస్‌‌ నడ్డి విరిచారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇండియాలో ఏకంగా ముగ్గురు సెంచరీలు చేయడం విశేషం.  

ధ్రువ్‌‌ జురెల్ (210 బాల్స్‌‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), రవీంద్ర జడేజా (176 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 బ్యాటింగ్‌‌),  కేఎల్‌‌ రాహుల్ (197 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 100)  సెంచరీలతో చెలరేగడంతో పాటు గిల్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వెస్టిండీస్ బౌలర్లలో ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖారీ పియరీ, వారికన్, సీల్స్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 146 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసుకోగా.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ కు రెండు.. వాషింగ్ టన్ సుందర్ లకు తలో వికెట్ లభించింది. 

లంచ్ తర్వాత గంటన్నర లోపే:

5 వికెట్ల నష్టానికి 68 పరుగులతో లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ తొలి గంటలోపే మిగిలిన 5 వికెట్లను చేజార్చుకుంది. 38 పరుగులు చేసి క్రీజ్ లో సెట్ అయిన అలిక్ అథనాజ్ ను వాషింగ్ టన్ సుందర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ స్వల్ప వ్యవధిలో జస్టిన్ గ్రీవ్స్ (25), జోమెల్ వారికన్ (0) ను పెవిలియన్ కు పంపించాడు. జడేజా జోహాన్ లేన్ ను ఔట్ చేసి టీమిండియాకు తొమ్మిదో వికెట్ అందించాడు. కుల్దీప్ చివరి వికెట్ తీసుకొని విండీస్ కథ ముగించాడు.