- మీ ఉత్పత్తులు మాకొద్దు..
- మన మిర్చి, మామిడి, కూరగాయలను తిప్పి పంపుతున్న విదేశాలు
- పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ తిరస్కరణ
- పరిమితికి మించి కెమికల్స్ వాడుతుండడంతో ఇబ్బందులు
- మిర్చిలో మిథామిడోఫాస్, మామిడిలోనూ ఫెస్టిసైడ్స్ కలకలం
- దేశంలో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ
- మరోవైపు క్షీణిస్తున్న భూసారం, భూగర్భ జలాలు కలుషితం
హైదరాబాద్, వెలుగు: ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను తాము తినలేమంటూ విదేశాలు తిప్పిపంపుతున్నాయి. అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, ధ్రువీకరణ పత్రాల లోపాలు వంటి కారణాలతో మామిడి, మిర్చి, కూరగాయలను విదేశాలు తిరస్కరిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలకు చెందిన పంటలపై విదేశీ మార్కెట్లలో అనుమానాలు వ్యక్తమవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రస్తుతం దాదాపు 275 సస్యరక్షణ మందులు, వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇంసెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ ద్వారా వివిధ పంటలపై నిర్ధారించిన మోతాదులో మాత్రమే వాడాల్సిఉంటుంది. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి విచక్షణారహితంగా వాడడంవల్ల పంట ఉత్పత్తుల్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు గరిష్ట అవశేష పరిమితి (ఎంఆర్ఎల్) నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండడంతో, పరిమితికి మించి మందులు వాడిన మన పంటలను విదేశాలు తిప్పి పంపుతున్నాయి.
మిర్చికి చైనా షాక్
మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోని గుంటూరుకు.. అక్కడి నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. ఇటీవల గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు కంటైనర్ల మిర్చిని చైనా కస్టమ్స్ అధికారులు వెనక్కి పంపించారు. మోతాదుకు మించి ‘మిథామిడోపాస్’ అనే పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించడంతో సంబంధిత ఎగుమతిదారులపై ఆంక్షలు విధించడమే కాకుండా భవిష్యత్తు ఎగుమతులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది గుంటూరు నుంచి చైనాకు వేలాది కంటైనర్లలో మిర్చి ఎగుమతి జరుగుతుంది. మిథామిడోపాస్ కలిగిన పురుగుమందుల తయారీ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
మామిడి ఎగుమతులపైనా ఎఫెక్ట్
రాష్ట్రంలో బంగినపల్లి, రసాలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. యూఏఈ, అమెరికా, కెనడా, యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున మామిడిపండ్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే పురుగుమందుల అవశేషాలు, ప్రాసెసింగ్ లోపాల వల్ల ఆయా దేశాల్లో దిగుమతులు నిలిచిపోతున్నాయి. జపాన్ ఇటీవల భారతీయ మామిడి దిగుమతులపై ఆంక్షలు విధించింది. వేపర్ హీట్ట్రీట్మెంట్(ఆవిరి ఉష్ణోగ్రతతో ట్రీట్మెంట్), క్రిమిసంహారక ప్రక్రియల అమలులో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. మరోవైపు నేపాల్ కూడా భారత మామిడి పండ్లలో పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఎగుమతులు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
కూరగాయల ఎగుమతులపై పెరుగుతున్న నిఘా
ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలు కఠినతరం కావడంతో కూరగాయలు, పండ్లపై ఆయా దేశాలు నిఘా పెంచుతున్నాయి. ఎక్కువ రసాయన అవశేషాలు ఉన్న పండ్లు, కూరగాయలు వాడితే దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావాలు పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, మిరప, పసుపు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉండటం వల్ల అనేక దేశాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని సార్లు సరుకును తిరస్కరిస్తుండగా.. మరికొన్ని సందర్భాల్లో కఠినమైన పరీక్షలు చేస్తున్నాయి.
పంటలను ముంచేస్తున్న కెమికల్స్.. భవిష్యత్తులో పెను ముప్పు
వ్యవసాయ నిపుణుల అంచనాల ప్రకారం తెలంగాణలో సిఫార్సు చేసిన మోతాదుకంటే 50 నుంచి 100 శాతం వరకు అధికంగా యూరియా, రసాయన ఎరువులు, పురుగుమందులను రైతులు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా వినియోగం 2020-– 21లో 16.42 లక్షల టన్నుల నుంచి 2024-– 25 నాటికి 20.07 లక్షల టన్నులకు పెరిగింది. గత 2025–26 నాటికి వినియోగం మరింత పెరిగింది. దేశంలో పురుగుమందులు ఎక్కువగా వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. హెక్టారుకు సగటున సుమారు 900 గ్రాముల పురుగుమందులు వాడుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. చీడపీడల భయంతో ఎక్కువసార్లు స్ప్రే చేయడం, కోతకు ముందు కూడా పురుగుమందులు చల్లడంతో పంటల్లో అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
సాయిల్ హెల్త్‌పై తీవ్ర ప్రభావం
అధిక రసాయనాల వినియోగంతో భూసారం క్షీణించడం, సేంద్రియ కార్బన్ శాతం తగ్గిపోవడం, భూగర్భ జలాలు కలుషితం కావడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. పురుగుమందుల అవశేషాలు ఉన్న ఆహార పదార్థాల వినియోగం వల్ల కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొన్ని రసాయనాల వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
తగ్గుతున్న పంట ఉత్పత్తుల నాణ్యత
ప్రపంచ మార్కెట్లో తెలంగాణ, ఏపీ పంటలకు గుర్తింపు ఉన్నా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంవల్ల ఎగుమతులపై ప్రభావం పడుతోంది. సమగ్ర చీడపీడల నిర్వహణ (ఐపీఎం), జీవ ఎరువులు, జీవ పురుగుమందుల వినియోగం, అవశేషాల పరీక్షలు, ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘దిగుబడి మాత్రమే కాదు... నాణ్యత కూడా ముఖ్యం’’ అనే దిశగా రైతులు అడుగులు వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు రసాయనాల వినియోగాన్ని నియంత్రిస్తే మన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంటుందని అంటున్నారు.
