
- టెక్సస్‌లో ఏడో తరగతి చదువుతున్న ఫైజాన్ జాకి
న్యూయార్క్: టెక్సస్‌లో నివాసం ఉంటున్న 13 ఏండ్ల ఇండో అమెరికన్ స్టూడెంట్ ఫైజాన్ జాకి.. 2025 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజేతగా నిలిచాడు. ‘ఎక్లెయిర్‌సిస్‌మెంట్’ అనే ఫ్రెంచ్ పదాన్ని సరిగ్గా స్పెల్ చేసి ఛాంపియన్షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 21వ రౌండ్లో విజేతగా నిలిచాడు. మేరీల్యాండ్‌లోని నేషనల్ హార్బర్లో గేలార్డ్ నేషనల్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు జరిగాయి. 2024 పోటీల్లో సెకండ్ ప్లేస్‌కే పరిమితమైన ఫైజాన్.. ఈసారి విజేతగా నిలిచాడు. స్పెల్ బీ పోటీల్లో ఫైజాన్ ఇప్పటి దాకా 4 సార్లు పాల్గొన్నాడు. టెక్సాస్ స్టేట్ డల్లాస్‌లోని సీఎం రైస్ మిడిల్ స్కూల్లో సెవెన్త్ క్లాస్ చదువుతున్నాడు.
ఫైజాన్ తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ హైదరాబాద్‌లోనే ఉంటారు. స్పెల్ బీ పోటీలను లైవ్‌గా వీక్షించారు. ఈ మేరకు ఫైజాన్ ఫ్యామిలీకి ఆర్గనైజర్లు కంగ్రాట్స్ చెప్పారు. ఫైజాన్‌ను విజేతగా ప్రకటించిన వెంటనే.. అతను స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలేం మాట్లాడాలో అర్థం కావడంలేదని సంతోషం వ్యక్తంచేశాడు. విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. తాను గెలుస్తానని అసలు అనుకోలేదని వివరించాడు.
ఈడబ్ల్యూ స్క్రిప్స్ కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ ఆడం సిమ్సన్ ఫైజాన్‌కు ట్రోఫీ, రూ.45 లక్షల నగదు, ఒక కమెమరేటివ్ మెడల్‌ను అందజేశారు. ఈ పోటీల్లో 243 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. 9 మంది ఫైనలిస్టులను ఓడించి గెలిచాడు. స్పెల్ బీ పోటీలు ప్రారంభించి 2025 నాటికి వందేండ్లు పూర్తయ్యాయి.