అమర్నాథ్ యాత్రికులకు అండగా ఆర్మీ

అమర్నాథ్ యాత్రికులకు అండగా ఆర్మీ

ఆర్మీ, కేంద్ర భద్రతా బలగాలంటే సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలని మాత్రమే మనం అనుకుంటాం. కానీబలగాలంటే భద్రత మాత్రమే కాదు..ఇంకా చాలా ఉంది. ఈ మధ్యే జమ్మూకశ్మీర్ లో భారీ వర్షం పడింది. కొద్దిసేపట్లోనే భారీగా కురిసిన వర్షానికి కొండలపైనుంచి వరద దూసుకొచ్చింది. ఇదే మార్గంలో మైదానంలా ఉన్న ప్రాంతంలో గుడారాలు వేసుకుని సేదదీరుతున్నారు అమర్నాథ్ యాత్రికులు. ఇదే టైంలో కొండలపై నుంచి దూసుకొచ్చిన వరద గుడారాలను ముంచెత్తింది. వరద ధాటికి గుడారాలు కొట్టుకుపోగా..16 మంది వరకు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఏం జరుగుతోందనేది గుర్తించే లోపే అంతా జరిగిపోయింది. అరుపులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. 

వర్ష బీభత్సానికి అమర్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పైనుంచి వరద వస్తుండటంతో యాత్రికులు ఎటూ కదల్లేని పరిస్థితి. ఓ వైపు గాయపడిన వారు అల్లాడుతున్నారు. మరోవైపు..ముందు కదలాల్సిన వారు ఎక్కడికక్కడే ఆగిపోయారు. ఒక్కో ప్రాంతంలో వందలాది మంది చిక్కుకుపోయారు. అయితే అంత బీభత్సం జరిగినా కొద్దిసేపట్లోనే అంతా సర్దుకుంది. వర్షం ఆగిన కొన్ని గంటల్లోనే యాత్రికులు తిరిగి తమ గమ్యం వైపు అడుగు వేశారు. అతి తక్కువ సమయంలో యాత్రికులు అమర్ నాథ్ వైపు నడక ప్రారంభించడానికి కారణం భద్రతా బలగాలు. 

యాత్రికులకు అండగా నిలిచిన భద్రతా బలగాలు

ఆర్మీ, CRPF, ITBP.. ఇలా బలగాలన్నీ ఓ వైపు భద్రత కల్పిస్తూనే.. మరోవైపు యాత్రికులకు సేవ చేశాయి. కొండచరియలు విరిగిపడిన వెంటనే గాయపడిన వారిని రెస్క్యూ చేసి ట్రీట్మెంట్ చేసింది భద్రతా బలగాలే. దూసుకొచ్చిన మట్టిదిబ్బల్లో కూరుకుపోయినన వారిని కాపాడింది వారే. ప్రమాదం జరిగిన రోజు రాత్రి వారికి నిద్ర లేదు. ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే అత్యాధునిక ఎక్విప్మెంట్ తో అక్కడికి చేరుకున్నారు. డ్రిల్లింగ్ మెషిన్లతో రాళ్లను పగలగొట్టారు. ఓ వైపు చలి, మరోవైపు వర్షం.. అయినా శిథిలాల  కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమించారు. 

రాళ్లు, మట్టి దిబ్బలు తగిలి గాయపడిన వారికి ట్రీట్మెంట్ చేసింది కూడా భద్రతా బలగాల సిబ్బందే. తమ దగ్గరున్న ఫస్ట్ ఎయిడ్ సామాగ్రితో వారికి ట్రీట్మెంట్ చేశారు. స్ట్రెచర్ పై మోసుకెళ్లి.. దగ్గరున్న హెల్త్ సెంటర్లలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్ అంబులెన్స్ లో పెద్ద హాస్పిటల్స్ కి తరలించారు. అక్కడితో వారి పని అయిపోలేదు. దెబ్బతిన్న గుడారాలను పునర్నిర్మించి..యాత్రికులు సేదదీరేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు..వర్షాలకు పైనుంచి వస్తున్న వరదను మళ్లించి యాత్రికులకు ఇబ్బంది లేకుండా చూశారు. ప్రమాదమని తెలిసినా కొండలపై నుంచి వస్తున్న నీటిలోకి దిగి..వాటిని మళ్లించారు.

తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసిన ఆర్మీ

యాత్రికులు వెళ్లాల్సిన మార్గం.. వర్షాలకు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నది. వెంటనే అక్కడికి చేరుకున్నారు భద్రతా సిబ్బంది. నిమిషాల వ్యవధిలో తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు. అది ఎంత ఏటవాలు ప్రాంతమైన.. వెనకడుగు వేయలేదు. యాత్రికుల రాకపోకలను పునరుద్ధరించారు. మొన్న జరిగిన ప్రమాదం రోజే కాదు..అమర్ నాథ్ యాత్ర ప్రారంభానికి చాలా రోజుల ముందు నుంచి బలగాలకు కంటి మీద నిద్ర లేదు. ఎందుకంటే అమర్ నాథ్ కు చేరుకునే పహల్గావ్, బాల్టల్ మార్గాల్లో అణవణువు గాలించారు జవాన్లు. ఉగ్రమూకల నుంచి ప్రమాదం లేకుండా ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓ వైపు వర్షం, మరోవైపు చలి..రాత్రి, పగలూ తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. కొండ అంచుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా యాత్రికుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 

అమర్ నాథ్ యాత్ర స్టార్టింగ్ పాయింట్ నుంచి యాత్రికులు తిరిగి వెనక్కి వచ్చే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారిని క్రమపద్ధతిలో పంపడం, ట్రాఫిక్  కంట్రోల్ చేయడం.. దారిలో యాత్రికులకు మంచినీరు, ఆహారం అందించడం.. ఇలా అడుగడుగునా వారికి తోడుగా ఉంటున్నారు. మంచులింగాన్ని దర్శించుకునేందుకు వస్తున్న వారి భద్రతే కాదు..వారికి సపర్యలు చేస్తున్నారు జవాన్లు. నడవలేని వారిని స్వయంగా భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. వయసు పైబడిన వారికి ఆసరా అవుతున్నారు. ప్రతి అడుగులో యాత్రికులకు తోడు, నీడగా ఉంటున్నారు జవాన్లు. 

కశ్మీర్ లోయలో మార్మోగుతున్న జై జవాన్ నినాదాలు

ఎత్తైన కొండల్ని ఎక్కలేక ఇబ్బంది పడుతున్న వారిని, కొండపైకి ఎక్కే క్రమంలో గాయపడిన వారిని ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. మైదాన ప్రాంతాల్లో తిరిగిన వారికి.. కొండ ప్రాంతాల్లో ప్రయాణం అంత సులువు కాదు. ఏ మాత్రం ఆద మరిచి ఉన్నా లోయలో పడిపోయే ప్రమాదముంది. అందుకే వారి వెంటే ఉండి నడిపిస్తున్నారు జవాన్లు. అందుకే కశ్మీర్ లోయలో ఇప్పుడు జై జవాన్ నినాదాలు మార్మోగుతున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి.. తమను కాపాడారని జవాన్లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు యాత్రికులు. జవాన్లు లేకుంటే తాము ప్రాణాలతో ఉండే వాళ్లమే కాదంటున్నారు.

మనిషికి గుండెలాగా.. దేశానికి ఆర్మీ పనిచేస్తోందని యాత్రికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా..తమ భద్రత కోసం అహర్నిశలు పని చేస్తున్నారని అంటున్నారు. సాధారణంగా అమర్నాథ్ యాత్రలో భం భం భోలే, హర్ హర్ మహాదేవ్ నినాదాలే వినిపిస్తాయి. అడుగడుగునా ఆ శంకరుడిని తలుచుకుంటూ ముందుకెళ్తారు యాత్రికులు. అక్కడ ఇప్పుడు జై జవాన్, జై ఆర్మీ నినాదాలు హోరెత్తుతున్నాయి. కేవలం అమర్ నాథ్ యాత్ర దగ్గరే కాదు. విపత్తు వచ్చినా, ప్రమాదం జరిగినా, అది భద్రత అయినా..మరే సేవా కార్యక్రమమైనా సరే భద్రతా బలగాలు అక్కడుంటాయి. తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా..ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వెనకాడరు. ప్రమాదాల బారిన పడిన వారిని తమ నైపుణ్యంతో  రక్షిస్తారు. మేమున్నామనే ధైర్యాన్నిస్తారు.