భారత సైన్యం ధైర్యసాహసాలు: సెకన్లలో కూలిపోయే బిల్డింగ్ నుండి 25 మందిని కాపాడిన రెస్క్యూ టీం..

భారత సైన్యం ధైర్యసాహసాలు: సెకన్లలో కూలిపోయే బిల్డింగ్ నుండి 25 మందిని కాపాడిన రెస్క్యూ టీం..

వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఎడతెరిపి లేకుండా వాన  కురుస్తుండటంతో మరోవైపు వాగులు, వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఊర్లకి ఊర్లే మునిగిపోగా కొన్నిచోట్ల వరదల వల్ల కొండచరియలు విరిగిపడి ఇల్లులు మొత్తం కొట్టుకుపోయాయి. అయితే పఠాన్‌కోట్‌లోని మాధోపూర్ హెడ్‌వర్క్స్ సమీపంలో వరదలో ఒక బిల్డింగ్ కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందు భారత సైన్య ధైర్యసాహసాలు అందరిని ఊపిరి పీల్చుకునేల చేసింది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ ఈ హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అక్కడ చిక్కుకున్న 22 మంది CRPF జవాన్లతో సహా మరో ముగ్గురుని రక్షించింది.  ఈ హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతంలో వరద నీరు ఉప్పొంగడం వల్ల  తీవ్రమైన ప్రమాదాన్ని చూపిస్తుంది.

అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్: భారత సైన్యం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ Xలో  ఈ రెస్క్యూ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తీవ్రమైన వరద వాతావరణంలో ఒక హెలికాప్టర్ కూలిపోనున్న భవనంపైకి వచ్చి ఆగి అక్కడ ఉన్నవారిని తరలించడం స్పష్టంగా కనిపిస్తుంది. మంగళవారం నుండి అక్కడ చిక్కుకున్న వారిని రక్షించడానికి బుధవారం తెల్లవారుజామున ఈ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ ఎంత వేగంగా జరిగిందో చెప్పడానికి పోస్ట్‌లో చూడొచ్చు. రెస్క్యూ ముగిసిన కొన్ని సెకన్లకే ఆ భవనం కూలిపోయింది. ఈ ఆపరేషన్‌లో పైలట్లు చూపిన ధైర్యాన్ని సైన్యం ప్రత్యేకంగా ప్రశంసించింది.

జమ్మూ, పంజాబ్లో వరదలు విధ్వంసం: జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కారణంగా పక్కనే ఉన్న పంజాబ్‌లో భారీ వరదలు సంభవించాయి. దింతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగస్టు 27 నుండి ఆగస్టు 30 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ మూసేయాలని ఆదేశించారు. జమ్మూ ఇంకా పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో సైన్యం సహాయ చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న వారిని విమానంలో తరలించడానికి రెస్క్యూ టీంస్ అలాగే హెలికాప్టర్లను మోహరించింది. మరోవైపు వైష్ణో దేవి పుణ్యక్షేత్రం సమీపంలో మరో రెస్క్యూ మిషన్ జరుగుతోంది, నిన్న మంగళవారం అక్కడ కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, 21 మందికి పైగా గాయపడ్డారు.