అదరగొట్టిన ఇండియన్ బ్యాంక్‌‌.. నికర లాభం 32 శాతం అప్‌‌

అదరగొట్టిన ఇండియన్ బ్యాంక్‌‌.. నికర లాభం 32 శాతం అప్‌‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌ (క్యూ4) లో  నికర లాభం 32 శాతం పెరిగి రూ.2,956 కోట్లకు చేరిందని ఇండియన్ బ్యాంక్ శనివారం ప్రకటించింది.  మొండిబాకీలు తగ్గడంతో పాటు, వడ్డీ ఆదాయం పెరగడంతో ప్రాఫిట్ డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో ఇండియన్ బ్యాంక్‌‌కు  రూ.2,247 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం ఆదాయం కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.16,887 కోట్ల నుంచి క్యూ4లో రూ.18,599 కోట్లకు పెరిగింది.

ఇందులో వడ్డీ ఆదాయం  రూ.14,624 కోట్ల నుంచి రూ.15,856 కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యత విషయంలో, బ్యాంక్ గ్రాస్  నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్‌‌  (ఏపీఏ) రేషియో  మార్చి 2024 నాటికి 3.95 శాతం నుంచి 3.09 శాతానికి తగ్గింది. అదేవిధంగా, నికర ఎన్‌‌పీఏ రేషియో 2024 చివరిలో 0.43 శాతం ఉండగా, తాజాగా  0.19 శాతానికి మెరుగుపడింది. బ్యాంక్  ప్రొవిజన్ కవరేజ్ రేషియో మార్చి 31, 2025 నాటికి 96.34 శాతం ఉండగా, తాజాగా  98.10 శాతానికి పెరిగింది.

క్యాపిటల్ అడెక్వసీ రేషియో 2023–24 చివరిలోని 16.44 శాతం నుంచి 17.94 శాతానికి మెరుగుపడింది.  మొత్తం 2024-–25 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే,  బ్యాంక్ నికర లాభం 35 శాతం వృద్ధి చెంది రూ.10,918 కోట్లకు చేరుకోగా,  మొత్తం ఆదాయం ఏడాది లెక్కన రూ.63,482 కోట్ల నుంచి రూ.71,226 కోట్లకు పెరిగింది.  ఎన్‌‌ఐఐ రూ.23,274 కోట్ల నుంచి రూ.25,176 కోట్లకు ఎగిసింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు 16.25 పైసల డివిడెండ్‌‌ను బ్యాంక్ బోర్డు  సిఫారసు చేసింది. దీనిపై  రాబోయే యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌లో  తుది నిర్ణయం తీసుకుంటారు.

ఇండియన్ బ్యాంక్ షేర్లు శుక్రవారం రూ. 558  వద్ద ముగిశాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ,  బాండ్లను అమ్మడం ద్వారా రూ.ఏడు వేల కోట్ల వరకు  సేకరించేందుకు బోర్డు  ఆమోదం తెలిపింది. ఇందులో, క్యూఐపీ లేదా రైట్స్ ఇష్యూ లేదా రెండింటి కలయిక ద్వారా షేర్లను అమ్మి  రూ.5,000 కోట్లను,   బాండ్స్ జారీ ద్వారా మరో రూ.2,000 కోట్లను బ్యాంక్ సేకరించనుంది.