Pahalgam Attack: పాక్ పై భారత్ బ్యాన్.. ఇక అన్ని దిగుమతులు బంద్..

Pahalgam Attack: పాక్ పై భారత్ బ్యాన్.. ఇక అన్ని దిగుమతులు బంద్..

India Vs Pakistan: పాకిస్తాన్ అండతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు కొన్ని రోజుల కిందట ఇండియన్ స్విడ్జర్‌లాండ్ గా పేరొందిన టూరిస్ట్ స్పాట్ పెహల్గావ్ లో చేపట్టిన దాడి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మోదీ సర్కార్ దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. తూతూమంత్రగా ఆంక్షలు చర్యలు వంటివి కాకుండా అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం అన్నట్లుగా రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోయాయి.

ఇందులో భాగంగా ముందు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. ఆ తర్వాత అనేక దౌత్యపరమైన చర్యలకు దిగింది. ఈ క్రమంలో ఇండియాలో ఉన్న పాకిస్థానీలను తమ దేశానికి వెంటనే తిరిగి వెళ్లాలని కూడా సూచించింది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ పాక్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి వ్యాపారాన్ని కొనసాగించకూడదని నిర్ణయించింది. దాయాది దేశం నుంచి అన్ని దిగుమతులను వెంటనే నిలిపివేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. 

తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 కింద పాక్ నుంచి ఎలాంది దిగుమతులు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా తాజా ఆదేశాలు జారీ అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఈ నిషేధానికి విరుద్ధంగా ఏదైనా మినహాయింపు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం నుంచి ఆమోదం తప్పనిసరి. 

గతనెల 22న పర్యాటకులపై ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలను కోల్పోయిన తర్వాత భారత్ పాక్ పై అన్ని మార్గాల్లో ఒత్తిడిని పెంచుతోంది. పెహల్గావ్ దాడికి భాద్యులు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నా వారిని వెతికి తీసుకొస్తామని, వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత వరుస చర్యలతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.