ఉలెన్‌బాటర్ (మంగోలియా): ఇండియా బాక్సర్లు ప్రీతి పవార్, మీనాక్షి హుడా.. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. గురువారం జరిగిన 54 కేజీల ఫైనల్లో ప్రీతి 5–0తో హువాంగ్ సియావో (చైనీస్‌తైపీ)పై గెలవగా, 48 కేజీల టైటిల్ బౌట్‌లో మీనాక్షి 5–0తో నోముందరి (మంగోలియా)ను చిత్తు చేసింది. బౌట్ ఆరంభం నుంచి ఇద్దరు ఇండియన్ బాక్సర్లు.. ప్రత్యర్థులపై పదునైన పంచ్‌లతో విరుచుకుపడ్డారు.
డిఫెన్స్‌తో పాటు అప్పర్ కట్స్, క్లీన్ హుక్స్‌తో వరుసగా పాయింట్లు నెగ్గారు. 60 కేజీల ఫైనల్లో ప్రియా గంగాస్ 3–0తో వోన్ యున్ గొయాంగ్ (నార్త్ కొరియా)పై, 70 కేజీల్లో అరుంధతి చౌదరీ 4–1తో బాకట్ సిడిష్ (కజకిస్తాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. 57 కేజీ ఫైనల్లో జైస్మిన్ లాంబోరియా 0–5తో పునర్వి రుయెన్‌రోస్ (థాయ్‌లాండ్) చేతిలో, 80+ కేజీల్లో అల్ఫియా పఠాన్ 0–5తో డినా ఇస్లామ్‌బెకోవా (కజకిస్తాన్) చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఇండియా 10 (4 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్) పతకాలతో సత్తా చాటింది.
