మౌంట్ అన్నపూర్ణపై బ‌ల్జీత్ కౌర్ ఆచూకీ లభ్యం

మౌంట్ అన్నపూర్ణపై బ‌ల్జీత్ కౌర్ ఆచూకీ లభ్యం

సోల‌న్‌ : భార‌తీయ ప‌ర్వతోరాహ‌కురాలు బ‌ల్జీత్ కౌర్ ఆచూకీ లభించింది.  బ‌ల్జీత్ కౌర్ సజీవంగానే ఉందని గుర్తించారు. మౌంట్ అన్నపూర్ణ వ‌ద్ద ఉన్న నాలుగ‌వ క్యాంపు నుంచి ఆమె సోమ‌వారం (ఏప్రిల్ 17వ తేదీన) క‌నిపించ‌కుండాపోయారు. దీంతో కంగారు పడిన ఓ బృందం ఆమె కోసం తీవ్రంగా గాలించింది. మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 18న) ఉద‌యం సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. హెల్ప్ కావాలంటూ రేడియో సిగ్నల్ పంపిన త‌ర్వాత రెస్క్యూ టీమ్ ఆమె కోసం వెళ్లింది.

బ‌ల్జీత్ లొకేష‌న్ 7375 మీట‌ర్ల ఎత్తులో ఉన్న జీపీఎస్ ద్వారా తెలిసింద‌ని గాలింపు బృందాలు వెల్లడించాయి. ఇద్దరు షెర్పా గైడ్ల స‌హ‌కారంతో మౌంట్ అన్నపూర్ణను ఆమె అధిరోహించారు. అయితే ప‌ర్వతం దిగుతున్న స‌మ‌యంలో అదృశ్యమ‌య్యారు. దీంతో ఆమె ఆచూకీ కోసం మూడు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

రాజ‌స్థాన్‌లోని కిష‌న్‌గ‌ద్‌కు చెందిన మౌంట‌నీర్ అనురాగ్ మాలు సోమ‌వారం (ఏప్రిల్ 17వ తేదీన) అదృశ్యమయ్యాడు. క్యాంపు ఫోర్ నుంచి దిగుతున్న స‌మ‌యంలో అత‌ను ఆరు వేల మీట‌ర్ల ఎత్తు నుంచి ఓ లోయ‌లో ప‌డి చ‌నిపోయిన‌ట్లు హిమాలయన్ టైమ్స్ వార్తా పత్రిక వెల్లడించింది. 

మౌంట్ అన్నపూర్ణ ఎత్తు 8091 మీట‌ర్లు. ప్రపంచంలో ఇది ప‌ద‌వ ఎత్తైన పర్వతం. గత ఏడాది 2022, మేలో.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బల్జీత్ కౌర్ లొట్సే పర్వతాన్ని అధిరోహించింది. గ‌త సీజ‌న్‌లో బ‌ల్జీత్ కౌర్ 8 వేల మీట‌ర్ల క‌న్నా ఎత్తు ఉన్న నాలుగు ప‌ర్వతాల‌ను ఎక్కి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే.