న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో దేశీయంగా కీలక రంగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. జర్మనీలోని నురెంబర్గ్‌లో జరుగుతున్న బయోఫాచ్ 2026 ప్రదర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలకు హాని కలిగించే ఏ రంగంలోనూ విదేశీ కంపెనీలకు ప్రవేశం కల్పించబోమని స్పష్టం చేశారు.
ఈ ఒప్పందంపై వచ్చే నెల సంతకాలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, గోధుమలు, వరి, సోయా, చికెన్, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు ఎటువంటి సుంకం మినహాయింపులు ఇవ్వలేదని రాజేశ్ తెలిపారు.
