ఇరాన్‌‌‌‌లో చిక్కుకున్న మత్స్యకారులు.. సురక్షితంగా స్వదేశానికి..

ఇరాన్‌‌‌‌లో చిక్కుకున్న మత్స్యకారులు.. సురక్షితంగా స్వదేశానికి..

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్‌‌‌‌లో చిక్కుకుపోయిన భారతీయ మత్స్యకారులు ఆర్మేనియా మీదుగా స్వదేశానికి చేరుకున్నారు. మత్స్యకారులతో కూడిన ఈ బృందం ప్రయాణిస్తున్న విమానం శనివారం భారత్‌‌‌‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత పౌరుల తరలింపునకు సహకరించిన ఆర్మేనియా విదేశాంగ మంత్రి అరరాత్ మిర్జోయాన్‌‌‌‌కు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమైన నెల రోజుల్లోనే సుమారు 1,150 మంది భారతీయులు ఆర్మేనియా, అజర్‌‌‌‌బైజాన్ భూ సరిహద్దుల ద్వారా ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు శుక్రవారం అబుదాబిపై జరిగిన క్షిపణి దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడినట్లు ప్రభుత్వం ధృవీకరించింది. వీరిలో నలుగురు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఒకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొంది. 

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం బాధితులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తోందని తెలిపింది. పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిశితంగా గమనిస్తోందని, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమమే తమ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.