న్యూఢిల్లీ: విచ్చలవిడి ఖర్చులు, దుబారాలకు మనదేశ జెన్జీ యువత దూరం జరుగుతోంది. వాళ్ల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. అనవసరమైన అప్పుల ఊబిలో కూరుకుపోకుండా జాగ్రత్త పడుతోంది. డబ్బు విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తోంది. అత్యధికులు డిజిటల్ పేమెంట్స్కు మొగ్గుచూపుతున్నారు.
సూపర్ డాట్ మనీ సంస్థ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం...యువతలో 74 శాతం మంది నెలకి 50కి పైగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. చాలామంది నెలకి 200 లావాదేవీలూ చేస్తున్నారు. స్నాక్స్ కొనాలన్నా, క్యాబ్ బుక్ చేయాలన్నా, బిల్లులు పంచుకోవాలన్నా క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తున్నారు. వీటిలో చిన్న ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి.
దాదాపు 76 శాతం లావాదేవీలు రూ.200 లోపే ఉంటున్నాయి. చిరుతిండ్లు, కిరాణా సరుకులు, రోజువారీ అవసరాల కోసమే ఇవి జరుగుతున్నాయి. గత ఏడాది కాలంగా చేసిన లక్షలాది యూపీఐ లావాదేవీల ఆధారంగా ఈ స్టడీ జరిగింది. తమ సంస్థ వినియోగదారులలో దాదాపు 72 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారని సూపర్మనీ తెలిపింది.
