రియాద్: పశ్చిమాసియాలో మూడు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధం భారతీయ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. బుధవారం సౌదీ అరేబియాలోని రియాద్ నగరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య 6కు చేరింది.
రియాద్‌పై జరిగిన ఈ దాడిలో సదరు వ్యక్తి నేరుగా క్షిపణి తగిలి మరణించాడా? లేదా గగనతలంలో క్షిపణిని అడ్డుకున్నప్పుడు కిందపడిన శకలాల వల్ల ప్రాణాలు కోల్పోయాడా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంతకుముందు మార్చి 13న ఒమన్‌లోని సోహార్ నగరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించగా, మరో పది మంది గాయపడ్డారు. సముద్ర మార్గంలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు.
