భారత్ లోని తమిళనాడుకు చెందిన వైద్య విద్యార్థి అబ్దుల్ షేక్ (22) చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ లో మృతిచెందాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. అక్కడ చికిత్సపొందుతూ విద్యార్థి అబ్దుల్ షేక్ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. విద్యార్థి అబ్దుల్ షేక్ ఈశాన్య చైనాలోని క్విక్విహార్ మెడికల్ యూనివర్సిటీ లో గత ఐదేళ్లుగా మెడిసిన్ కోర్సు చేస్తున్నాడు. ప్రస్తుతం కోర్సుకు సంబంధించిన ఇంటర్న్ షిప్ లో ఉన్నాడు.
గత నెల(డిసెంబరు) మొదటివారంలో ఇండియాకు వచ్చిన విద్యార్థి.. డిసెంబరు 11వ తేదీన చైనాకు తిరిగి వెళ్లిపోయాడు. వెళ్లగానే అక్కడ 8 రోజులు క్వారంటైన్ లో గడిపాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు లోనవడంతో అబ్దుల్ షేక్ ను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతడు చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఇంటి నుంచి చైనాకు వెళ్లి కనీసం 20 రోజులైనా గడవకముందే అబ్దుల్ షేక్ మృతిచెందడం.. వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అబ్దుల్ షేక్ పార్థివ దేహాన్ని చైనా నుంచి ఇండియాకు తీసుకురావాలని ఆయన కుటుంబ సభ్యులు భారత విదేశాంగ శాఖను, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.