
న్యూఢిల్లీ: రాబోయే ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా మెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైంది. ఈ టూర్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల ఫ్రెండ్లీ సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 15 నుంచి 21 వరకు పెర్త్ లో జరగనున్నాయి. ప్రస్తుతం ఇండియా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 8వ ప్లేస్‌లో ఉండగా.. ఆసీస్ ఆరో స్థానంలో బలమైన జట్టుగా ఉంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఆగస్టు 29 నుంచి బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆసియా కప్ షురూ అవనుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది. కాబట్టి ఆసియా కప్‌కు ముందు జట్టు బలాబలాలను అంచనా వేసుకోవడానికి ఈ సిరీస్ కీలకం కానుంది.
‘ఆసియా కప్ వంటి పెద్ద టోర్నీకి ముందు ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టుతో ఆడటం మాకు చాలా ముఖ్యం. రాబోయే నాలుగు మ్యాచ్‌లు జట్టులోని లోపాలను సరిదిద్దుకుని, ఆటను మరింత మెరుగు పరుచుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల పెర్ఫామెన్స్ ఆధారంగా ఆసియా కప్ జట్టును ఎంపిక చేస్తాం. ఆసియా కప్ గెలవడమే మా టార్గెట్’ అని హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ అన్నాడు. కాగా, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా 3–2తో ఆస్ట్రేలియాపై నెగ్గి చరిత్ర సృష్టించింది. కానీ, ఇటీవల జరిగిన ప్రో లీగ్‌లో రెండుసార్లు ఆ టీమ్ చేతిలో ఓడింది.