IND vs ENG 2025: భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. నాలుగో టెస్టులో ప్లేయింగ్ 11 గమనించారా..

IND vs ENG 2025: భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. నాలుగో టెస్టులో ప్లేయింగ్ 11 గమనించారా..

ఇంగ్లాండ్ తో టీమిండియా నాలుగో టెస్ట్ ఆడుతూ బిజీగా ఉంది. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో బుధవారం (జూలై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో గిల్ సేన టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ టెస్ట్ కోసం భారత జట్టు ప్లేయింగ్ లో మూడు మార్పులు చేసింది. ఫామ్‌‌లో లేని కరుణ్‌‌ నాయర్‌‌ను తప్పించి సాయి సుదర్శన్‌‌ను  తీసుకుంది. ఇక గాయపడిన ఆకాశ్‌‌ దీప్‌‌, నితీశ్‌‌ రెడ్డి ప్లేస్‌‌ల్లో అన్షుల్‌‌ కాంబోజ్‌‌ను అరంగేట్రం చేయించడంతో పాటు శార్దూల్‌‌ ఠాకూర్‌‌కు ఛాన్స్ ఇచ్చింది. నాలుగో టెస్టులో మన జట్టు ప్లేయింగ్ 11 ను గమనిస్తే ఒక ఆసక్తికర విషయం తెలుస్తోంది. 

93 ఏళ్ళ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లతో బరిలోకి దిగడం విశేషం. 1932లో టీమిండియా తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు అత్యధికంగా నలుగురు లెఫ్ట్ హ్యాండర్ లతోనే మ్యాచ్ ఆడింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్ టెస్టులో ఈ రికార్డ్ బ్రేక్ అయింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు భారత జట్టు ఆడిన 592 మ్యాచ్ లాడగా.. 5 గురు లెఫ్ట్ హ్యాండర్లతో బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి కావడం ఆసక్తికరంగా మారింది. 

ALSO READ | IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్..? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు టీమిండియా 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. క్రీజ్ లో శార్దూల్ ఠాకూర్ (35), వాషింగ్ టన్ సుందర్ (7) ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి 264 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ సేన ప్రారంభంలోనే జడేజా వికెట్ కోల్పోయింది. ఆర్చర్ బౌలింగ్ లో జడేజా బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో స్లిప్ లో బ్రూక్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. తొలి రోజు సాయి సుదర్శన్‌‌ (61), యశస్వి జైస్వాల్‌‌ (58) హాఫ్‌‌ సెంచరీలకు తోడు కేఎల్‌‌ రాహుల్‌‌ (46), రిషబ్‌‌ పంత్‌‌ (37 రిటైర్డ్‌‌హర్ట్‌‌) రాణించారు.