లాసానె: ఎఫ్‌ఐహెచ్ హాకీ ఫైవ్స్ తొలి టోర్నమెంట్‌లో ఇండియా మెన్స్ టీమ్ విజేతగా నిలిచింది. టోర్నీలో ఓటమి లేకుండా దూసుకొచ్చిన ఇండియా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 6-–4 తేడాతో పోలెండ్ జట్టుపై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. తొలి నాలుగు నిమిషాల్లోనే ప్రత్యర్థికి మూడు గోల్స్ ఇచ్చుకొని 0–3తో వెనుకబడిన ఇండియా అద్భుతంగా పుంజుకుంది. సంజయ్ (7వ నిమిషం), గురీందర్ సింగ్ (8వ ని.) వెంటవెంటనే గోల్స్ చేసి టీమ్‌ను రేసులోకి తీసుకురాగా.. ధామి బాబీ సింగ్ (10, 18వ ని.), మొహమ్మద్ రహీల్ (12, 16వ ని.) డబుల్స్ గోల్స్‌తో జట్టును విజేతగా నిలిపారు. అంతకుముందు చివరి లీగ్ మ్యాచ్‌లో పోలెండ్‌పైనే 6–2తో గెలిచిన ఇండియా ఫైనల్ చేరింది. ఇక, విమెన్స్ సెక్షన్‌లో మాత్రం ఎతిమరపు రజనీ కెప్టెన్సీలో ఇండియా ఫైనల్ చేరుకోలేక నిరాశ పరిచింది. స్విట్జర్లాండ్ చేతిలో 3–4తో ఓడిన ఇండియా.. సౌతాఫ్రికాతో పోరును 4–4తో డ్రా చేసుకుంది.

