V6 News

అప్పుల ఊబిలో ఇండియన్ మిడిల్‌క్లాస్ ప్రజలు.. సంచలన రిపోర్ట్, కళ్లు తెరవండిక..!

అప్పుల ఊబిలో ఇండియన్ మిడిల్‌క్లాస్ ప్రజలు.. సంచలన రిపోర్ట్, కళ్లు తెరవండిక..!

Saurabh Mukherjea: భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి చెందినవారే. అయితే గడచిన దశాబ్ధకాలంగా పెరుగుతున్న ప్రపంచీకరణతో పాటుగా వీరి ఆలోచనలు సైతం మారిపోతున్నాయి. ప్రధానంగా భారతీయ నాగరికతలోకి పాశ్చాత్యదేశాల ప్రభావం వేగంగా చొచ్చుకుపోవటం మధ్యతరగతి ప్రజల ఆర్థిక మూలాలతో పాటు వారి ప్రవర్తనలోనూ అనేక మార్పులను తీసుకొస్తోంది. 

ప్రస్తుతం భారతీయ మధ్యతరగతి ప్రజలు కోలుకోలేని అప్పుల ఊహిలో చిక్కుకుపోతున్నారనే వాస్తవం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజురోజుకూ ఈ పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయనే వాస్తవాన్ని మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా తాజాగా ఒక ఇంటర్వూలో బయటపెట్టారు. కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు ఏకకాలంలో అనేక రుణాలను తీసుకుంటూ వాటిని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్న వాస్తవాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 

రిజర్వు బ్యాంక్ డేటా ఆధారంగా మాట్లాడిన సౌరభ్ ముఖర్జియా గత దశాబ్ధకాలంగా దేశంలో రిటైల్ రుణాలు, క్రెడిట్ కార్డుల వినియోగం 4 శాతం నుంచి 11 శాతం మేర భారీ పెరుగుదలను చూసిందని అన్నారు. అయితే ప్రజలు అప్పులపై బ్రతికేందుకు ఈ రుణాలను ఉపయోగిస్తున్నారని పెట్టుబడుల కోసం కాదని చెప్పారు. ఈ క్రమంలో రుణాలు తీసుకునే స్థాయిలో ఆర్థికంగా బలంగా లేని వారే 45 శాతం అప్పులు చేస్తున్నవారిలో ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రివ్యూ రిపోర్ట్ వెల్లడించటం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ సొమ్మును వినియోగానికి, ఆస్థిరహిత ఖర్చులకు వారు వాడుతున్నట్లు తేలింది.

ALSO READ : IPO News: సంచలనం సృష్టించటానికి వస్తున్న ఐపీవో.. టార్గెట్ రూ.58 వేల కోట్లు, గెట్ రెడీ

ఈ క్రమంలో ఇప్పటికే దేశంలోని మధ్యతరగతిలో 5-10 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ రుణాలను కలిగి అప్పుల వలయంలో చిక్కుకుని సతమతమౌతున్నట్లు తేలటం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
- మధ్యతరగతి భారతీయుల్లో 67% మంది వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు తేలింది.
- మొత్తం రుణగ్రహీతల్లో 25% మంది క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ తో పాటుగా కనీసం ఒక హై-టికెట్ లోన్ కలిగి ఉన్నారని వెల్లడైంది.
- మొత్తం మధ్యతరగతి రుణగ్రహీతల్లో 45% మంది సబ్‌ప్రైమ్‌ లెండర్లు, వారి రుణాల్లో సగం మంది రోజువారీ అవసరాలను తీర్చుకోవటానికి మాత్రమే సదరు రుణ మెుత్తాలను వినియోగిస్తున్నారు.