
న్యూ ఢిల్లీ: భారత్ తమపై మిసైల్ దాడులు చేసింది నిజమేనని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి దాటిన తర్వాత నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ సహా పలు ప్రాంతాలపై ఇండియన్ ఆర్మీ మిసైల్ అటాక్స్ చేసిందని ఆయన అంగీకరించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 9న అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 గంటల సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నాకు ఫోన్ చేశారు.
ఇండియా బాలిస్టిక్ మిసైల్ దాడులు చేస్తున్నదని చెప్పారు. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ సహా ఇతర ప్రాంతాలపై దాడులు జరుగుతున్నట్టు తెలిపారు. ఆ టైమ్‌లో మునీర్ ఆత్మవిశ్వాసంతోనే మాట్లాడారు. ఆయన మాటల్లో దేశభక్తి కనిపించింది. మన దేశాన్ని కాపాడేందుకు మన ఎయిర్‌ఫోర్స్ స్వదేశీ టెక్నాలజీతో పాటు అత్యాధునిక గాడ్జెట్స్‌ను చైనీస్ జెట్స్ నుంచి ప్రయోగించింది” అని అన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలను మన ఆర్మీ ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పాక్ దాడులకు తెగబడింది. మన దేశంలోని పలు సిటీలు లక్ష్యంగా డ్రోన్లు, మిసైల్స్ ప్రయోగించింది. వాటన్నింటినీ గాల్లోనే కూల్చేసిన మన ఆర్మీ.. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసింది.