
న్యూఢిల్లీ, వెలుగు: సెయిలింగ్‌లో రాణిస్తున్న సికింద్రాబాద్ రెయిన్‌బో హోమ్స్ విద్యార్థిని మీజా భానును ఇండియన్ నేవీ అడ్మిరల్ త్రిపాఠి అభినందించారు. అమన్ వేదిక హోమ్ ఫర్ గర్ల్స్ మెడిబావికి చెందిన 14 ఏళ్ల రమీజా భాను.. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్, అధ్యక్షులు, ఇతర కోచ్‌ల సారథ్యంలో వివిధ రాష్ట్రాల్లో సెయిలింగ్ చాంపియన్ షిప్‌ల్లో పలు విజయాలను సొంతం చేసుకుంది.
రమీజా విజయాల గురించి తెలుసుకున్న ఇండియన్ నేవీ అడ్మిరల్ త్రిపాఠి సదరు విద్యార్థినిని ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి, అభినందించారు. ఈ సందర్భంగా మెమొంటో అందజేశారు. చిన్న వయసులోనే రమీజా భాను సెయిలింగ్‌లో రాణించడం రెయిన్‌బో హోమ్స్‌కు గర్వకారణమని రెయిన్‌బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ, రెయిన్‌బో హోమ్స్ రెసిడెన్షియల్ కేర్ డైరెక్టర్ అంబిక, రెయిన్‌బో ఫౌండేషన్ ఇండియా బోర్డు సభ్యురాలు శ్రీలత, సిటీ డెస్క్ ప్రోగ్రామ్ మేనేజర్ క్రాంతి, ప్రాజెక్ట్ ఇన్‌చార్జ్‌లు ఎల్లయ్య, నమ్రత జైస్వాల్ పేర్కొన్నారు.
నేవీ అధికారులను కలిసినవ వారిలో సుహీమ్ షేక్, కోచ్ ప్రీతి కొంగర, చందన చక్రవర్తి ఉన్నారు. కాగా, సెయిలింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి నవంబర్ 2 వరకు ఒమన్‌లో జరగనున్న ముసన్నా సెయిలింగ్ ఛాంపియన్‌షిప్- 2025లో ఇండియా తరఫున రమీజా పాల్గొంటోంది.