ఇద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ ఆ జంటకు పెళ్లి సంబరం ఎంతో సేపు నిలువలేదు. పెళ్లైన గంటల వ్యవధిలోనే జరిగిన విమానం ప్రమాదంలో నవ వరుడు మృతి చెందగా.. యువతి తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం..
భారత సంతతికి చెందిన దేవ్ ఫిజీ అనే 25 ఏళ్ల కుర్రాడు అమెరికాలోని ప్రముఖ డెల్టా ఎయిర్ లైన్స్ విమానయాన సంస్థలో ఫస్ట్ ఆఫీసర్ (పైలట్)గా పని చేస్తున్నాడు. దేవ్ తన ప్రియురాలు జెస్నీని 2026, మే 31న పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ వేడుక ముగిసిన అనంతరం రాత్రి సమయంలో దేవ్ తన భార్యతో కలిసి హెలికాప్టర్లో హోటల్‌కు బయలుదేరాడు.
దేవ్ కూడా పైలటే కావడంతో వాతావరణం సరిగ్గా లేదని.. టేకాఫ్ రిస్క్ అని హెలికాప్టర్ పైలట్ తో చెప్పాడు. కానీ పైలట్ దేవ్ మాట పట్టించుకోకుండా హెలికాప్టర్ టేకాఫ్ చేశాడు. వాతావరణ పరిస్థితుల అనుకూలించక హెలికాప్టర్ టేకాఫ్ అయిన కాసేపటికే జార్జియా రాష్ట్రం డాసన్ కౌంటీ సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొండలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు దేవ్ ఫిజీతో పాటు హెలికాప్టర్ పైలట్ అక్కడికక్కడే మరణించారు.
నూతన వధువు జెస్నీ తీవ్ర గాయాలపాలైంది. దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ కావడంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటన స్థలానికి చేరుకునేందుకు రెస్క్యూ బృందాలకు దాదాపు 5 గంటల సమయం పట్టింది. అప్పటి వరకు తీవ్ర గాయాలతో జెస్నీ నరకయాతన అనుభవించింది. తీవ్ర గాయాలపాలైన జెస్నీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. పెళ్లి గంటల వ్యవధిలోనే పెళ్లి కొడుకు చనిపోవడం, నవ వధువు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
