జోరుగా ప్రాక్టీస్.. బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్

జోరుగా ప్రాక్టీస్.. బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్

ఇంగ్లండ్‌‌‌‌తో తొలి టెస్టు కోసం ఇండియా ప్రాక్టీస్ స్పీడు పెంచింది. ఉప్పల్ స్టేడియంలో  సోమవారం ఉదయం సెషన్‌‌‌‌లో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌‌‌‌లో నిమగ్నమయ్యారు. కోహ్లీ, అయోధ్యకు వెళ్లిన జడేజా తప్ప మిగతా ప్లేయర్లంతా దాదాపు మూడున్నర గంటల పాటు చెమటలు చిందించారు. కెప్టెన్ రోహిత్, రాహుల్, గిల్ బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్ పెట్టారు. టీమ్ ఉదయం 9.30కి స్టేడియానికి చేరుకుంది. 
హెడ్‌‌‌‌ కోచ్ ద్రవిడ్, రోహిత్ 20 నిమిషాల పాటు చర్చించుకోగా మిగతా ప్లేయర్లు స్టేడియంలో  వార్మప్‌‌‌‌ చేశారు.

జైస్వాల్, అశ్విన్ మొదటగా నెట్స్‌‌‌‌లోకి వచ్చారు. జైస్వాల్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ నుంచి త్రో డౌన్స్‌‌‌‌ ఎదుర్కోగా.. అశ్విన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌‌‌‌లో బ్యాటింగ్ చేశాడు. తర్వాత బంతి అందుకున్న అశ్విన్‌‌‌‌.. అక్షర్‌‌‌‌‌‌‌‌తో కలిసి కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌కు బంతులు విసిరాడు. ఈ ఇద్దరితో పాటు ఓ లెగ్ స్పిన్నర్ (నెట్ బౌలర్‌‌‌‌‌‌‌‌) బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కొంటూ రోహిత్  ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇద్దరు స్పిన్నర్లతో పాటు బుమ్రాను ఫేస్ చేసిన హిట్‌‌‌‌ మ్యాన్‌‌‌‌  పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ డ్రైవ్స్, పుల్ షాట్లు కొట్టాడు.

అయితే, అక్షర్ వేసిన ఓ బాల్‌‌‌‌ అతని ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ను పడగొట్టింది. కాసేపటికి రోహిత్, జైస్వాల్ రెస్ట్‌‌‌‌ తీసుకోగా  రాహుల్‌‌‌‌, గిల్ నెట్స్‌‌‌‌లోకి వచ్చి ప్రాక్టీస్ చేశారు. ఈ ఇద్దరూ మంచి స్ట్రోక్స్‌‌‌‌ కొడుతూ కనిపించారు. కీపర్ కేఎస్‌‌‌‌ భరత్ మాత్రం ముకేశ్ కుమార్ బౌలింగ్‌‌‌‌లో చాలా ఇబ్బంది పడ్డాడు. కొంత గ్యాప్‌‌‌‌ తర్వాత రెండోసారి నెట్స్‌‌‌‌లోకి వచ్చిన రోహిత్ ఈసారి లోకల్ స్పిన్నర్ల బౌలింగ్‌‌‌‌లో ప్రాక్టీస్ చేశాడు.  ఈసారి బంతిని గాల్లోకి లేపకుండా గ్రౌండ్ షాట్స్, కట్ షాట్స్‌‌‌‌ కొట్టాడు.  కొత్త కీపర్‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌ కీపింగ్‌‌‌‌తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్‌‌‌‌లోనూ ఆకట్టుకున్నాడు. మధ్యాహ్నం సెషన్‌‌‌‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్‌‌‌‌లో పాల్గొన్నారు.